లక్ష కోట్లు కాదు.. రూ.52 వేల కోట్లే.. ప్రభుత్వ అప్పులపై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు చేయలేదని.. రూ.52 వేల కోట్లు మాత్రమే రుణం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం (డిసెంబర్ 17) అసెంబ్లీలో రాష్ట్ర అప్పులు, ఎఫ్ఆర్‎బీఎమ్ పరిమితి చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.లక్ష 23 వేల కోట్లు అప్పు చేసిందని అన్నారు. ఈ క్రమంలో హరీష్ రావు వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు చేయలేదు.. రూ.52 వేల కోట్లు మాత్రమే రుణం తీసుకుందని క్లారిటీ ఇచ్చారు.

ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సగం డబ్బులు అయిపోతున్నాయని విమర్శించారు.  సివిల్ సప్లై బిల్లులు కూడా రూ.62 వేల కోట్లు ఉన్నాయన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని ఒకేసారి సరి చేయడం వీలు కాదని.. గత ప్రభుత్వం హయాంలో అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక స్థితిని తిరిగి గాడిలో పెడుతున్నామని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ మాదిరి కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నామన్నారు. 

పదేళ్లలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని చురకలంటించారు భట్టి. కాంగ్రెస్ చేసిన అప్పులపై హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతూ.. సభను పక్కదారి పట్టిస్తు్న్నారని ఫైర్ అయ్యారు.  పదేళ్లలో మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాకుండా.. మేం తీసుకున్న ప్రతి రూపాయి అప్పుకు సరైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తానికి రాష్ట్ర అప్పులపై హరీష్ రావు, భట్టి మధ్య మాటల యుద్ధంతో అసెంబ్లీ హీటెక్కింది.