మోడీ ఆశీస్సులతో అదానీ దేశ సంపద దోచుకుంటుండు: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్:  ప్రధాని మోడీ ఆశీస్సులతో ఆయన మిత్రుడు, బిలియనీర్ గౌతమ్ అదానీ దేశ సంపద దోచుకుంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం (డిసెంబర్ 18) ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లస్ రోడ్ నుండి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి రాజ్ భవన్ రూట్‎లో బైఠాయించారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అదానీ దేశ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. అదానీ దేశ ప్రజలను సొమ్మును ఏ విధంగా దోచుకుంటున్నారు.. బ్యాంకులను ఓ విధంగా మోసం చేశారో హిండెన్ బర్గ్, అమెరికా న్యాయవాదులు చెప్పారని గుర్తు  చేశారు. 

Also Read :- రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి

అదానీ ఆర్థిక అవకతవకలపై పార్లమెంట్‎లో చర్చ కోసం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కొన్ని నెలలుగా జాతుల మధ్య అల్లర్లతో మణిపూర్ అట్టుడికిపోతున్న మోడీ నోరు విప్పడం లేదని విమర్శించారు. ఈ క్రమంలోనే అదానీ ఇష్యూ, మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ ఏఐసీపీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దిగామని తెలిపారు.