రెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..!

  • స్వచ్ఛంద సంస్థ సహకారం, ఎమ్మెల్యే చొరవతో 

గద్వాల, వెలుగు: మతిస్థిమితం కోల్పోయిన ఓ యువకుడు ఎక్కడెక్కడో తిరిగి చివరకు రెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వచ్ఛంద సంస్థ కృషితో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో మంగళవారం మతిస్థిమితం లేని యువకుడిని తల్లిదండ్రులకు అప్పగించారు . గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రాముకు ఇద్దరు కుమారులు అందులో తిమ్మప్పకు (26) మతిస్థిమితం లేదు. బంగ్లాదేశ్ సరిహద్దు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్డా జిల్లాలో రోడ్ల వెంట తిరుగుతుండగా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు తార శంకర్ చేరదీశాడు.

రెండు నెలలు ఆయన యోగ క్షేమాలు చూసుకున్నాడు. తిమ్మప్పను  వివరాలు అడిగితే   కేవలం ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేరు మాత్రమే  చెప్పడంతో  ఆన్ లైన్ లో ఎమ్మెల్యేకృష్ణ మోహన్ రెడ్డి వివరాలు సేకరించి ఆయనకు ఫోన్ చేసి చేసినట్టు సంస్థ నిర్వాహకుడు తెలిపాడు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి తల్లిదండ్రులకు సమాచారం అందించి సొంత ఖర్చులతో బెంగాల్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు విమానం లో తిమ్మప్ప తో పాటు స్వచ్ఛంద సంస్థ నిర్వహకులను రప్పించాడు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తల్లిదండ్రులకు తిమ్మప్పను అప్పగించాడు. ఈ సందర్బంగా స్వచ్ఛంద సంస్థ నిర్వహుడు తార శంకర్ ను ఎమ్మెల్యే సన్మానించారు.