మాజీ సైనికులకు కార్పొరేషన్​ పెట్టాలి

గత ప్రభుత్వం  పదవీ విరమణ పొందిన మాజీ సైనికులను పట్టించుకున్న దాఖలాలు లేవు. బంగారు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయంలో నంబర్ వన్. శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరిగింది అని దశాబ్ది ఉత్సవాల పేరిట వేల కోట్లు ఖర్చు చేశారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లిఫ్టింగ్ ఎ రివర్ అని డిస్కవరీ ఛానల్​లో ప్రచారాలకు ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేశారు. కార్పొరేషన్​ల పేరిట లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ, దేశానికి సేవ చేసిన మాజీ సైనికుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించలేకపోయారు. దేశ రాజకీ

యాల్లో చక్రం తిప్పడానికి గల్వాన్ లోయలో వీరమరణం పొందిన పంజాబ్, హర్యానా రాష్ట్రాల సైనికులకు తెలంగాణ రాష్ట్ర సైనిక నిధులు కేటాయించారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎంతో కొంత  న్యాయం జరుగుతుందని కలలు కన్న మాజీ సైనికుల ఆశలు ఆవిరయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఎజెండాగా సాగిన పాలనలో ఒక్క కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తప్ప మాజీ సైనికులకు ఎక్కడా ఒక్క గజం భూమి కూడా కేటాయించిన దాఖలాలు లేవు. 33 జిల్లాలలో కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్లతో సమానంగా 100 రూపాయలకు గజం చొప్పున ప్రభుత్వ భూములలో పార్టీ ఆఫీసులు ( తెలంగాణ భవన్లు) నిర్మించారు తప్ప మాజీ సైనికులకు ఏ ఒక్క జిల్లాలో ఒక కమ్యూనిటీ హాల్ కేటాయించింది లేదు. ప్రజా ప్రభుత్వమైనా మాజీ సైనికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి.

అన్ని రాష్ట్రాల్లో ఉన్నా తెలంగాణలోనే లేదు

మాజీ సైనికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్, సోమాజిగూడ,  జిల్లాలలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలాయి.  ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్స్, క్వాలిఫై మార్కులు, ఆర్మీ డిగ్రీ అమలు చేయడం లేదు. తద్వారా ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతోంది. పది జిల్లాలు 33 జిల్లాలుగా ఏర్పడినా ఇప్పటికీ అన్ని జిల్లాలలో సైనిక సంక్షేమ కార్యాలయాలు ఏర్పాటు కాలేదు. మాజీ సైనికుల సంక్షేమ కోసం జిల్లాలలో కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయాల్సిన కమిటీలు పదేళ్లుగా పత్తాలేవు.  ఏపీలో కూడా చంద్రబాబు ప్రభుత్వం మాజీ సైనికులను గుర్తించి వారి  సంక్షేమం కోసం 10 కోట్లు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.  

ఆర్థిక సహాయం హామీ అమలు చేయాలి

రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ (కరోనా, ఫ్లడ్ రిలీఫ్)లలో మాజీ సైనికులు స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్నారు.  మా ఉద్యోగాలు మాకు రావాలంటే అన్ని కులాలకు ఉన్నట్టు మా మాజీ సైని"కులం" కు కూడా ఒక కార్పొరేషన్ ఉంటే అటు ప్రభుత్వానికి ఇటు మాజీ సైనికులకు మధ్య ఒక వారధిలా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా తమ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సైనికులకు ఆర్థిక సహాయం ఇస్తామని పేర్కొన్నది. త్వరగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇస్తే బాగుంటుంది.  ఇప్పటికైనా రాష్ట్రంలో 33 జిల్లాల మాజీ సైనికుల సంక్షేమ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు విని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

- బందెల సురేందర్ రెడ్డి, 
మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు