2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 27న ఇడుపులపాయ నుండి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పులివెందుల, కమలాపురం మీదుగా ప్రొద్దుటూరు చేరుకొని మొదటి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావటంతో పార్టీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలోని ముఖ్యనేతలతో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా ఈ సభకు హాజరు కానున్న నేపథ్యంలో ప్రొద్దుటూరులో లాడ్జిలకు డిమాండ్ ఏర్పడింది.
ప్రొద్దుటూరులో బహిరంగ సభ కోసం స్థానిక నాయకులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తీ చేశారు. ఈ సభ తర్వాత 28వ తేదీన ఆళ్లగడ్డ, నంద్యాలల్లో రోడ్ షోలను నిర్వహిస్తారు. 29వ తేదీన కర్నూలులో బహిరంగ సభలో పాల్గొంటారు. 30వ తేదీన పుట్టపర్తి జిల్లా హిందూపురంలో బస్సుయాత్ర, బహిరంగ సభలు నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 27 నుండే ప్రచారం మొదలు పెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల సందడి ముమ్మరం అయ్యింది.