- లోకల్ కంటెంట్‌కే జనం జై
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వాడకం అంచనాలను మించుతోంది. 5జీ టెక్నాలజీ కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెట్ వాడకం భారీగా పెరుగుతోంది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌ను ఏడాది లెక్కన పరిశీలిస్తూ నోకియా ‘ఎంబిట్’ పేరుతో తయారు చేసిన రిపోర్టు ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం... 2021లో మనదేశంలో భారీ ఎత్తున మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్లు పెరిగారు. ఈ కాలంలో యూజర్ల సంఖ్య రెట్టింపు అయింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. టెలికం కంపెనీలు ఒకవైపు 5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం సిద్ధమవుతున్నాయి. భారతదేశంలో ఇప్పటికే కోటి 5జీ ఫోన్లు/డివైజ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి. ఐదు సంవత్సరాల క్రితం మనదేశంలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య 34.5 కోట్లు కాగా, ఇప్పుడు ఇది 76.5 కోట్లకు చేరింది. 5జీ డివైజ్/సేవలు 2021 నాటికి తొమ్మిది బిలియన్ డాలర్లను అందించాయని అంచనా. 90శాతం మంది భారతీయులు స్థానిక భాషల్లోని కంటెంట్‌ని వినియోగించేందుకు ఇష్టపడుతున్నారు. 2030 నాటికి దేశంలోని డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్‌లో షార్ట్-ఫారమ్ వీడియోల డిజిటల్ అడ్వర్టైజింగ్ వాటా 20శాతం వరకు ఉండొచ్చు. 2030 నాటికి 5జీ టెక్నాలజీ ప్రపంచ జీడీపీలో 1శాతం లేదా 1.3 ట్రిలియన్ డాలర్లను సమకూర్చనుంది. ఆరోగ్య సంరక్షణ, యుటిలిటీలు, మీడియా అప్లికేషన్‌లు, మానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ సిటీల వంటి వాటికి 5జీ టెక్నాలజీ కీలకంగా మారనుంది.
నెలకు సగటున 17జీబీ వాడకం..
గత సంవత్సరంలో 4జీ డేటా ట్రాఫిక్ 31శాతం పెరగగా, యూజర్ నెలకు సగటున17 జీబీ 4జీ మొబైల్ డేటాను ఉపయోగించాడు. 2021లో భారతదేశంలో ఈ టెక్నాలజీ వాడకందారుల సంఖ్య దాదాపు నాలుగు కోట్లు పెరిగింది. ఇండియాలో ఉత్పత్తి అయిన మొత్తం డేటా ట్రాఫిక్‌లో దాదాపు 99శాతం 4జీ నుంచే వచ్చింది. 4జీ డివైజ్‌ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. గత ఏడాది 16 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడవగా, వీటిలో మూడుకోట్ల 5జీ డివైజ్‌లు ఉన్నాయి. వీటిలో యాక్టివ్ 4జీ డివైజ్‌లు 80శాతం కంటే ఎక్కువగా ఉండగా, 5జీ పరికరాలు కోటి పైగా ఉన్నాయి. ‘‘త్వరలోనే 5జీ స్పెక్ట్రమ్ వేలం ఉంటుంది. ఈ సంవత్సరం చివర్లో సేవలను ప్రారంభిస్తారు. దీంతో భారతదేశంలో డిజిటల్ అంతరాలు తగ్గుతాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఇండస్ట్రీ 4.0 స్మార్ట్ సిటీల వంటి వాటిని సర్వీస్ ప్రొవైడర్లు తీసుకురావచ్చు’’ అని నోకియా తెలిపింది.
