విషంగా ఢిల్లీలో గాలి.. డేంజర్ స్థాయిలో ఎయిర్ క్వాలిటీ

విషంగా ఢిల్లీలో గాలి.. డేంజర్ స్థాయిలో ఎయిర్ క్వాలిటీ

దేశ రాజధాని ఢిల్లీలో ఇంకా ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. దీపావళికి ముందుకు కొంత తగ్గినట్టు అనిపించినా.. దీపావళి పండగ సందర్భంగా క్రాకర్స్ ఎక్కువ మోతాదులో కాల్చడంతో కథ మళ్లి మొదటికే వచ్చింది. దీపావళి పోయి మూడు రోజులు కావస్తున్నా.. ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి పడిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో AQI అధిక స్థాయికి చేరుకుంది. వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతో తెల్లవారుజామున దట్టమైన మంచు అలముకున్నాయి. 

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. ఆనంద్ విహార్లో AQI 430..ఆర్కే పురంలో 417, పంజాబీ బాగ్ లో 423, జహంగీర్ పూర్ లో 428కి చేరుకోవడంతో బుధవారం ఢిల్లీ అంతటా వాయు కాలుష్యం ప్రమాదక స్థాయికి పడిపోయింది. 

ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ నియంత్రించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలుచేపడుతోంది. మంగళవారం (నవంబర్ 14) జోంటి సరిహద్దు ప్రాంతంలో వాయు కాలుష్య నియంత్రణ చర్యల అమలును సమీక్షించారు ఢిల్లీ కార్మిక మంత్రి రాజ్ కుమార్. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది..నియంత్రించాల్సిన అవసరం తప్పనిసరి.. మాప్రభుత్వం నిరంతరం వాయు కాలుష్యం నియంత్రించేందుకు కృషి చేస్తోంది.. స్థానికులు సహకరించాలని మంత్రి రాజ్ కుమార్ కోరారు. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం నాలుగో దశ వాయు కాలుష్య నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.