న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇద్దరు మైనర్ బాలికల రేప్ ఘటనలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దర్యాప్తును వేగవంతం చేయాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఈ అంశంపై ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో హోం మంత్రిత్వ శాఖ గురువారం సమావేశం నిర్వహించింది. ఢిల్లీలోని నంగల్ ఏరియాకు చెందిన తొమ్మిదేండ్ల బాలికపై కొందరు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన ఘటన, మయూర్ విహార్ ఏరియాకు చెందిన ఆరేండ్ల బాలికపై రేప్ జరిగిన ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులతో భేటీ నిర్వహించామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, 30 రోజుల్లోపు రెండు కేసుల్లోనూ చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేసుల్లో విచారణ వేగంగా పూర్తయి, దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆ రెండు కేసులివే..
ఢిల్లీలోని ఓల్డ్ నంగల్ ఏరియాలో ఆగస్టు 1న నలుగురు వ్యక్తులు శ్మశానం దగ్గర తొమ్మిదేండ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి, హత్య చేశారు. ఆ తర్వాత కేసును పక్కదారి పట్టించేందుకు ఆ రాత్రికి రాత్రే రహస్యంగా దహనం చేసే ప్రయత్నం చేశారు. శ్మశానం దగ్గర ఉన్న ఫ్రిజ్‌లో కూల్ వాటర్ తాగేందుకు వెళ్లిన బాలికకు కరెంట్ షాక్ తగిలి మరణించినట్లు కథ అల్లి తప్పించుకోవాలని నిందితులు యత్నించారు. పైగా ఈ విషయం పోలీసుల దాకా వెళ్తే పోస్టుమార్టం అని పాప శరీర భాగాలు మాయం చేస్తారని నమ్మించే ప్రయత్నం చేసి బలవంతంగా అంత్యక్రియలు చేయాలని చూశారు. లోకల్స్ విషయంపై అనుమానం వచ్చి గొడవ చేయడంతో అంత్యక్రియలు మధ్యలో నిలిపేసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
ఇక రెండో ఘటన మయూర్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిలోక్‌పురి ప్రాంతానికి చెందిన ఆరేండ్ల బాలికపై బుధవారం ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వాస్తవానికి మొదట తీవ్ర గాయాలతో ఉన్న బాలికను కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. సీరియస్ కండిషన్‌లో ఉన్న ఆ బాలికను పరీక్షించిన డాక్టర్లు అసలు విషయం తెలిసి వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేశారు. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు మెడికల్ చెకప్‌లో తేలడంతో రిపోర్ట్‌ను పోలీసులకు పంపారు. ఆ బాలిక ఇంటి పక్కనే ఉండే 34 ఏండ్ల వ్యక్తి ఈ ఘతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
