ఢిల్లీలో 2,500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

ఢిల్లీలో 2,500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

ఢిల్లీలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ అధికారులు 2500 కోట్ల రూపాయల విలువైన 354 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన ముగ్గురు, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. స్పెషల్‌ సెల్‌కు పట్టుబడ్డ డ్రగ్స్‌ రాకెట్‌లో ఇదే అత్యంత పెద్దదన్నారు అధికారులు. నార్కో టెర్రరిజం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను విచారిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా తమ ఆపరేషన్‌ నడుస్తున్నట్లు స్పెషల్‌ సెల్‌ అధికారి నీరజ్‌ ఠాకూర్‌ తెలిపారు. ఈ డ్రగ్స్‌ ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వచ్చాయన్నారు. కంటైనర్లలో దాచి ముంబై నుంచి ఢిల్లీకి సముద్రం ద్వారా తీసుకువచ్చారని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్‌ను ప్రాసెస్‌ చేశారని.. వాటిని అక్కడే ఓ అద్దె ఇంట్లో స్టోర్ చేసినట్లు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈ డ్రగ్స్‌ను పంజాబ్‌లో సప్లై చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు.