బర్త్ డే పార్టీలో గొడవ.. స్నేహితుల చేతిలో యువకుడు హత్య

బర్త్ డే పార్టీలో గొడవ.. స్నేహితుల చేతిలో యువకుడు హత్య

ఢిల్లీలోని మంగోల్‌పురిలో ఓ యువ‌కుడు దారుణ హత్యకు గురయ్యారు. బర్త్ డే పార్టీలో తలెత్తిన వివాదం ఘర్షణగా మారి హత్యకు దారితీసింది. మృతుడిని రింకు శర్మగా గుర్తించారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రింకు శర్మ(25).. గురువారం రాత్రి స్నేహితుడు డానిష్‌తో కలిసి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లాడు. పార్టీలో ఇద్దరి మధ్య ఏదో విషయమై వివాదం తలెత్తింది. పార్టీ అనంతరం రింకు తన ఇంటికి వెళ్ల‌గా… డానిష్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి రింకు శర్మను కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ రింకు శర్మను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రి వద్దకు త‌ర‌లించగా… తీవ్ర గాయాల‌పాల‌వ‌డంతో అత‌డు కొద్దిసేపటికే మృతి చెందాడు.

హత్యపై అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధాన్షు మాట్లాడుతూ.. రింకు,డానిష్ ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారని.. ఇద్దరూ స్నేహితులేనని చెప్పారు.ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఇద్దరూ కలిసి గతేడాది ఫుడ్ బిజినెస్ ప్రారంభించారని… కానీ నష్టాలు రావడంతో మూసేశారని తెలిపారు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని… బర్త్ డే పార్టీలోనూ దీనిపైనే ఇద్దరూ గొడవపడ్డారని చెప్పారు. ఇదే క్రమంలో డానిష్ అతని స్నేహితులతో కలిసి రింకు శర్మను హత్య చేశాడని చెప్పారు. ఈ కేసులో జాహిద్, మెహతాబ్, డానిష్, ఇస్లాం అనే నలుగురు నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, రింకూ శ‌ర్మ‌కు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సంస్థతో సంబంధం ఉందని, అయోధ్యలోని రామ మందిరానికి విరాళాలు సేకరిస్తున్నందునే కొంతమంది దాడికి పాల్పడి హత్య చేశారని  ఆరోపించారు. విశ్వ హిందూ పరిషత్  సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ కూడా  ఇవే ఆరోపణలు చేయగా..  పోలీసులు మాత్రం  ఖండించారు.