ఆదిలాబాద్​లో ఢిల్లీస్థాయి టెంపరేచర్లు

  • దేశ రాజధానిలో 4.5 డిగ్రీలు..అర్లి (టీ)లో 5.2 డిగ్రీలుగా రికార్డు
  • తెలంగాణలోని 7 జిల్లాల్లో 7 డిగ్రీల లోపే నమోదు
  • 27 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు
  • పంజాబ్, హర్యానా, రాజస్థాన్​లో తీవ్రంగా చలిగాలులు
  • కాశ్మీర్​లో మైనస్ 3.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • హిమాలయాల నుంచి వీస్తున్న చలిగాలులే కారణం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు ఏ మాత్రం తగ్గకుండా.. మన రాష్ట్రంలోనూ మినిమం టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్​, బిహార్​, పంజాబ్​వంటి రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోని ఒక్క జిల్లా..ఒక్క ప్రాంతం అన్న తేడా లేకుండా అన్ని జిల్లాలూ ఇగమెక్కిపోయాయి. ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​లాంటి ఏజెన్సీ జిల్లాల్లో.. ఢిల్లీలో చలికాలంలో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సోమవారం ఢిల్లీలోని పూసాలో అత్యల్పంగా 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఓవరాల్ గా 4.5 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా.. ఆదిలాబాద్​లోని అర్లి (టీ)లో 5.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఉత్తరాది రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోని జిల్లాల్లోనూ సాయంత్రం 5 దాటగానే మొదలవుతున్న చలిగాలులు.. తెల్లారి మిట్టమధ్యాహ్నం దాటినా తగ్గుముఖం పట్టడం లేదు. 

2014 తర్వాత మళ్లీ అంతటి రేంజ్​లో ఇప్పుడు రాత్రి టెంపరేచర్లు రికార్డవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో 27 జిల్లాల్లో టెంపరేచర్లు 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవడంతోపాటు మరో 3 జిల్లాల్లో 10 డిగ్రీలు, ఇంకో 3 జిల్లాల్లోనూ 11 నుంచి 12 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ నిరుడితో పోలిస్తే ఇప్పుడు రాత్రి టెంపరేచర్లు 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య పతనమవడం గమనార్హం. ఉత్తరాది, హిమాలయాల నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల (వెస్టర్న్​ డిస్టర్బెన్స్​) ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. ఆ పశ్చిమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలతోపాటు దక్షిణాది జిల్లాలపైనా చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరో 3,4 రోజులపాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని హెచ్చరిస్తున్నారు. 

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి 

రాష్ట్రంలోనూ ఉత్తర, దక్షిణ జిల్లాలన్న తేడా లేకుండా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొన్నటిదాకా చలి ప్రభావం అంతగా లేని దక్షిణాది జిల్లాలూ ఇప్పుడు చలికి వణికిపోతున్నాయి. ఒక్క రోజులోనే వాతావరణ పరిస్థితి మారిపోయింది. ఇక, ఆదిలాబాద్​ జిల్లాలోని అర్లి (టీ)లో అత్యల్పంగా 5.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మొన్నటిదాకా చలి ప్రభావం అంతగా లేని దక్షిణాది జిల్లాల్లోనూ కోల్డ్​ వేవ్​ తీవ్రమైంది. సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నాగర్​కర్నూల్ లాంటి జిల్లాలు ఆరెంజ్​ అలర్ట్​లో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 7 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లా సత్వార్​లో 6.6, వికారాబాద్​ జిల్లా బంట్వారంలో 6.7, రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో 6.7, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​లో 6.7, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 6.9, కామారెడ్డి జిల్లా మేనూరులో 6.9 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదవడం గమనార్హం. 

హైదరాబాద్​లోనూ..

హైదరాబాద్​ నగరంలోనూ టెంపరేచర్లు భారీగా పతనమవుతున్నాయి. శివారు ప్రాంతాలతోపాటు ముఖ్యమైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సిటీ పరిధిలోని మౌలాలిలో అత్యల్పంగా 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హెచ్​సీయూ వద్ద 7.2, బీహెచ్ఈఎల్​ 7.4, రాజేంద్రనగర్​ 8.2, గచ్చిబౌలి 9.3, వెస్ట్​మారేడ్​పల్లిలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్​, మచ్చ బొల్లారంలో 10.2, శివరాంపల్లిలో 10.3, జీడిమెట్లలో 11.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 

ఉత్తరాది రాష్ట్రాలు గజగజ

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. పలు నగరాలను ఉదయం పూట మంచు దుప్పటి కప్పేస్తున్నది. చలిగాలులు వీస్తుండడంతో బయటకు అడుగుపెట్టే పరిస్థితిలేదని జనం చెప్తున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే నమోదవుతుండగా.. కాశ్మీర్​ లోయలో మైనస్ టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. దేశ రాజధాని వాసులను ఓవైపు వాయుకాలుష్యం, మరోవైపు చలి వణికిస్తున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వెరీ పూర్ కేటగిరిలో ఉందని, సోమవారం ఏక్యూఐ 345 పాయింట్లుగా నమోదైందని అధికారులు తెలిపారు. సోమవారం ఢిల్లీలోని పూసాలో అత్యల్పంగా 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు. ఓవరాల్​గా 4.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని, సాధారణం కన్నా ఇది 4 డిగ్రీలు తక్కువని వివరించారు. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతో వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ షెల్టర్ క్యాంపులలో నిర్వాహకులు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. 

పంజాబ్, హర్యానాలలో..

పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో చలి తీవ్రత పెరి గింది. ఫరీద్​కోట్​లో సోమవారం ఒక డిగ్రీ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పంజాబ్​లోని గురుదాస్ పూర్, భటిండాలలో రాత్రిపూట టెంపరేచర్​లు కనిష్టానికి పడిపోతున్నాయి. 2 డిగ్రీల నుంచి 4.6 డిగ్రీల మధ్య టెంపరేచర్ నమోదవుతున్నది. పఠాన్ కోట్, అమృత్​సర్​సహా ఇతరత్రా సిటీలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హర్యానాలో కనిష్ట  ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజస్థాన్​లోని ఫతేపూర్ లో ఆదివారం రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 1.2 డిగ్రీలు, చురులో 1.6 డిగ్రీలు, భిల్వారాలో 2.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక, కశ్మీర్ లోయలో మంచు దుప్పటి పరుచుకుంది. శ్రీనగర్​లో ఆదివారం మైనస్ 3.4  డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. శనివారం రాత్రి ఇక్కడ మైనస్ 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయిందని ఐఎండీ తెలిపింది.