ఇయ్యాల ఢిల్లీలో ఆల్ టైం రికార్డు ఉష్ణోగ్రత!
46 డిగ్రీలకు చేరొచ్చని ఐఎండీ అలర్ట్
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భానుడు భగభగ మండుతున్నాడు. గత ఐదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. రోజురోజుకూ నగరంలో ఎండలు పెరుగుతుండటంతో రికార్డు టెంపరేచర్లు నమోదవుతున్నాయి. గురువారం సిటీలో 46 డిగ్రీల ఆల్‌టైం రికార్డు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అవగా, బుధవారం 42 డిగ్రీలకు చేరింది. గురువారం నాడు 44 డిగ్రీల వరకు చేరుకోవచ్చని.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ టెంపరేచర్ 46 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 1941 ఏప్రిల్ 29న 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 21న ఢిల్లీలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతకు చేరింది. ఆ తర్వాత ఏనాడూ ఢిల్లీ ఉష్ణోగ్రతలు ఆ రికార్డును దాటలేదు. కాగా, ఇయ్యాల 81 ఏళ్ల రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా. దేశంలో పలుచోట్ల ఎండ తీవ్రత పెరగొచ్చని, 122 ఏళ్ల తర్వాత మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
