ఢిల్లీని వదలని వరద.. మరో మూడు రోజులు రెయిన్ అలర్ట్

ఢిల్లీని వదలని వరద.. మరో మూడు రోజులు రెయిన్ అలర్ట్

ఢిల్లీ ప్రజలకు వరద కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి.  యమునా నదికి వరద ఉదృతి కొనసాగుతుండడంతో  రాజ్ ఘాట్ ఇంకా వదర నీటిలోనే ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదలు మాత్రం తగ్గడం లేదు. దీంతో దేశ రాజధానిలోని పలు ప్రాంతాలు ఇంకా  జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

భారీ వర్షాలు, వరదలకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన  ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కేజ్రీవాల్ పరిశీలిస్తున్నారు. వరదల కారణంగా పలు రోడ్లను క్లోజ్ చేశారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించేలా కనిపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనదారులు కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. 

వర్షాలు తగ్గినా..వరద నీరు మాత్రం లోతట్టు ప్రాంతంలో నిలిచిపోయింది. దీంతో వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. యమునా నది శాంతించడంతో ఢిల్లీ వాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వర్షాలు మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.  రాబోయే మూడు రోజులు ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.