న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ పేరును చేర్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసులో ఈడీ ఇప్పటికే 4 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. గత అక్టోబర్లో ఎంపీ సంజయ్ సింగ్ను అరెస్టు కూడా చేసింది. ఈడీ ఆరోపణల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి వ్యాపారవేత్త దినేశ్ అరోరా పలువురికి ముడుపులు చెల్లించినట్లు తెలిపింది.
ఇందులో భాగంగానే ఎంపీ సంజయ్ సింగ్ కు ఆయన నివాసంలోనే రూ.2 కోట్లు అందించానని అరోరా వెల్లడించాడు. ఈ వ్యవహారం మొత్తం 2021–22 మధ్య కాలంలో జరిగిందని ఈడీ చార్జ్ షీట్లో పేర్కొంది. అయితే, సంజయ్ సింగ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనను అరెస్టు చేశారని మండిపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన పెద్ద లీడర్లలో సంజయ్ సింగ్ రెండో వాడు.. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్
సిసోడియా ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
