ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమన్న సీఈసీ

  • ఫిబ్రవరి 5న ఢిల్లీలో పోలింగ్
  • అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఈసీ
  • ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
  • ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమన్న సీఈసీ రాజీవ్ కుమార్
  • ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగలేదని వివరణ 
  • మొత్తం 13 వేల పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 5న ఎలక్షన్స్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. మొత్తం 70 సీట్లకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 8న ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలిపింది. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఢిల్లీలో తక్షణమే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, వాటన్నింటిలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఆ ఆరోపణలు అవాస్తవం.. 
కొందరు కావాలనే ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు చేస్తున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ అన్నారు. వాళ్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు. ‘‘ఈవీఎంల ట్యాంపరింగ్ కు చాన్సే లేదు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ సరళిలో భారీ పెరుగుదల ఉంటోందని వస్తున్న ఆరోపణలు సరికాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ శాతాన్ని ఎవరూ మార్చలేరు. ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు అవకాశమే లేదు. ఇదే విషయాన్ని కోర్టులు తమ తీర్పుల ద్వారా దాదాపు 42 సార్లు చెప్పాయి” అని పేర్కొన్నారు.

‘‘ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఐదు వీవీప్యాట్ లను లెక్కించాలని 2019లో కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి 67 వేలకు పైగా వీవీప్యాట్ లను లెక్కించాం. దాదాపు 4.5 కోట్లకు పైగా వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించగా, అందులో ఒక్క ఓటు కూడా తేడా రాలేదు” అని స్పష్టం చేశారు. అలాగే ఓటర్ జాబితాలోనూ ఎలాంటి అవకతవకలు జరగడం లేదన్నారు. ఈ సమావేశంలో ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు పాల్గొన్నారు.

ఇదీ షెడ్యూల్..

  • ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌: జనవరి 10
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: జనవరి 17
  • నామినేషన్ల పరిశీలన: జనవరి 18
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: జనవరి 20
  • పోలింగ్‌‌‌‌: ఫిబ్రవరి 5
  • ఓట్ల లెక్కింపు, రిజల్ట్​: ఫిబ్రవరి 8