న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ఫోన్ ట్యాపింగ్, కో–లొకేషన్ కేసుల్లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు సోమవారం కొట్టివేసింది. అంతకుముందు ఈడీతో పాటు నిందితుల తరపున వాదనలు విన్న న్యాయమూర్తి సునైనా శర్మ బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. విచారణ సందర్భంగా ఈడీ లాయర్ మాట్లాడుతూ ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితురాలికి నేరంతో "ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా" సంబంధం ఉందని పేర్కొంటూ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు.
2009 నుంచి 2017 వరకు, ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ రవి నారాయణ్, చిత్ర రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవి వారణాసి, హెడ్ (ప్రిమైసెస్) మహేష్ హల్దీపూర్ తదితరులు కలిసి కో–లొకేషన్ స్కామ్ కోసం ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగులను మోసం చేయడానికి కుట్ర పన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఐసెక్ అనే సంస్థ సేవలు వాడుకున్నారు. సైబర్ మోసాలపై పీరియాడిక్ స్టడీ అంటూ ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగుల ఫోన్ కాల్స్‌ను చట్టవిరుద్ధంగా విన్నారు. ఇందుకోసం ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగుల నుంచి పర్మిషన్ తీసుకోలేదని ఈడీ ఆరోపించింది.
