త్వరలో ఢిల్లీ సీఎం అతిషి అరెస్ట్..? కేజ్రీవాల్ సంచలన ఆరోపణ

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మాజీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని త్వరలో అరెస్ట్ చేయనున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆప్ ప్రకటించిన మహిళా సమ్మన్ యోజన, సంజీవని యోజన పథకాలపై ప్రజల్లో ఆదరణ దక్కడంతో కొందరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ‘ఎక్స్’లో కేజ్రీవాల్ పోస్ట్ చేశారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కుతున్న ఆదరణను చూసి ప్రత్యర్థులు ఓర్వలేకపోతున్నారని, ఫేక్ కేసులో ఢిల్లీ సీఎం అతిషిని మరికొన్ని రోజుల్లో అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మాజీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. ఈలోపు ఆప్కు చెందిన సీనియర్ నేతల ఇళ్లలో రైడ్స్కు వ్యూహ రచన చేస్తున్నారని కేజ్రీవాల్ తన పోస్ట్లో చెప్పుకొచ్చారు. ఢిల్లీలో 2025లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో.. ఆప్ ను మళ్లీ గెలిపిస్తే మహిళా సమ్మన్ యోజన, సంజీవని యోజన పథకాలను అమలు చేస్తామని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

మహారాష్ట్రలో బీజేపీ తిరిగి అధికారం దక్కించుకోవడంలో కీలకంగా ఉన్న ‘లాడ్లీ బెహనా యోజన’ పథకానికి దగ్గరగా ఉన్న పథకమే ఈ ‘మహిళా సమ్మన్ యోజన’. ఈ పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు ప్రభుత్వం నెలకు 1000 రూపాయలను ఖాతాలో జమ చేస్తుంది. ఆప్ను గెలిపిస్తే ఈ మొత్తాన్ని 2,100కు పెంచుతామని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంజీవని యోజన పథకంలో భాగంగా ఢిల్లీలో 60 ఏళ్లు, అంతకు మించి వయసు పైబడిన వృద్ధులకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుంది. సీనియర్ సిటిజన్స్ మెడికల్ ఖర్చులను ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అనే భేదం లేకుండా ప్రభుత్వమే చూసుకుంటుంది. 

ఇప్పటికే ఈ రెండు పథకాలకు సంబంధించి ఆప్ ఇంటింటి రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మహిళా సమ్మన్ యోజన’ పథకానికి అప్లై చేసుకోవడం కోసం మహిళలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, తమ వాలంటీర్లే ఇంటికొచ్చి మరీ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో మహిళలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బీజేపీ ఈ పథకాల కోసం ఇంటింటికీ వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తుండటంపై మండిపడింది. ఇవి ఢిల్లీ ప్రభుత్వ పథకాలు కాదని.. ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఆప్ ఇస్తున్న హామీలు, చేస్తున్న ప్రచారం మాత్రమేనని ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తోంది.