మీడియా ముందే బోరున ఏడ్చేసిన ఢిల్లీ సీఎం.. అసలేమైందంటే..?

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అతిశీ మీడియా ముందే బోరున విలపించారు. మాజీ ఎంపీ, కల్కాజీ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి తన తండ్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోమవారం (జనవరి 6) ఆమె స్పందించారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలపై అతిశీ మీడియాతో మాట్లాడుతూ.. నా తండ్రిని బీజేపీ నేత ఘోరంగా అవమానించాడని కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయాల కోసం బీజేపీ నేతలు దిగజారిపోతున్నారని.. రమేష్ బిధూరి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

నా తండ్రి తన జీవితమంతా ఉపాధ్యాయుడిగా పని చేసి.. ఎంతోమంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు  విద్య నేర్పించారనే విషయం రమేష్ బిధూరికి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు  నా తండ్రికి 80 సంవత్సరాలు. రాజకీయాల కోసం 80 ఏళ్ల వృద్ధుడిని రమేష్ బిధూరి దుర్భాషలాడాడు. ఈ దేశంలో రాజకీయాలు ఇంత దిగజారిపోతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు’’ అంటూ అతిశీ ఎమోషనల్ అయ్యారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అతిశీ కల్కాజీ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. అతిశీకి పోటీగా కల్కాజీ నుంచి రమేష్ బిధూరి బీజేపీ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ఈ క్రమంలోనే రమేష్ బిధూరి కల్కాజీలో ప్రచారం నిర్వహిస్తూ అతిశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అతిశీ మర్లెనాగా ఉన్న ఆమె.. ఇప్పుడు అతిషి ఇప్పుడు సింగ్‎గా మారిందని.. రాజకీయాల కోసం అతిశీ తన తండ్రిని కూడా మార్చేసిందని.. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ లక్షణాన్ని ప్రతిబింబిస్తోందని రమేష్ బిధూరి వ్యక్తిగత విమర్శలు చేశారు. 

అంతేకాకుండా.. 2001లో భారత పార్లమెంట్‎పై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్ గురును క్షమించాలని ఆమె తల్లిదండ్రులు క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారని ఆయన ఆరోపించారు. అతిశీ కంటే ముందుగా రమేష్ బిధూరి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపైన ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే.. కల్కాజీలో రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్న రమేష్ బిధూరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.