సీఎం ఆతిశిని అరెస్టు చేస్తరు

  • ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్​ సంచలన ఆరోపణలు
  • తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపే కుట్ర

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం ఆతిశిని ఫేక్ కేసులో అరెస్ట్ చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ఎన్నికలకు సిద్ధమయ్యే టైంలో ఆతిశితోపాటు ఆప్  సీనియర్ నేతల ఇండ్లపై దాడులు చేయాలని కేంద్ర ఏజెన్సీలైన ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను ఢిల్లీ బీజేపీ నేతలు కోరారని పేర్కొన్నారు. 

ఆతిశిని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని ఆ ఏజెన్సీలకు బీజేపీ హైకమాండ్ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయని తనకు సమాచారం అందిందని తెలిపారు. వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా నిజమే గెలుస్తుందని కేజ్రీవాల్ దీమా వ్యక్తం చేశారు. పదేండ్లుగా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర బీజేపీ సర్కారు ఢిల్లీ ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడ్డుకుంటూ ప్రజలను తిప్పలు పెట్టిందని గుర్తుచేశారు. 

ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ ఆప్ సర్కారు పనిచేస్తూ ఉండటంతో పార్టీ నేతలను, మంత్రులను బీజేపీ జైలుకు పంపడం మొదలు పెట్టిందని ఆరోపించారు. అయినా తాము పనిచేయడం ఆపలేదన్నారు. ఇప్పుడు ఆ పార్టీ తలొంచక తప్పని పరిస్థితిలో సీఎంను అరెస్ట్ చేసేందుకు కొత్త కుట్రలు పన్నిందని పేర్కొన్నారు. 

నిజమే గెలుస్తుంది: ఆతిశి

తప్పుడు కేసులో తనను అరెస్ట్ చేసినా సత్యమే గెలుస్తుందని సీఎం ఆతిశి అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. ఆప్ సీనియర్ నేతలను అక్రమంగా జైలుకు పంపినప్పటికీ చివరికి నిజం బయటపడిందని, వాళ్లంతా బయటికి వచ్చారని ఆమె గుర్తుచేశారు. కాగా, తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2,100, వృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం పేరిట ఆప్ సర్కారు ఇటీవల 2 పథకాలను ప్రకటించింది.

 అందుకు దరఖాస్తులను కూడా తీస్కోవడం ప్రారంభించింది. అయితే, ఇదంతా ఉత్తదే అంటూ ప్రభుత్వం పేరిట గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా పేపర్లో ప్రకటనలు వెలువడ్డాయి. దీనిపై సీఎం ఆతిశి మండిపడ్డారు. ఆ రెండు పథకాలను అమలు చేసేందుకు కేబినెట్ నిర్ణయించిందని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కేజ్రీవాల్ సెగ్మెంట్​లోని మహిళలకు డబ్బు పంచినట్లు తేలిందని అతిశీ తెలిపారు.