IPL 2025: వార్నర్‌కు గుడ్ బై.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ ప్లేయర్స్ వీరే

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తుంది. గత రెండేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పేలవ ఆట తీరు కారణంగా వార్నర్ ను ఢిల్లీ యాజమాన్యం రిటైన్ చేసుకోవడానికి ఆసక్తిగా లేనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ కు ఐపీఎల్ లో డిమాండ్ తగ్గే అవకాశం కనిపిస్తుంది. 

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడుదల చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఈ యువ వికెట్ కీపర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్తున్నాడనే రూమర్స్ వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఢిల్లీ రిటైన్ చేసుకునే లిస్ట్ లో పంత్ మొదటి స్థానంలో ఉన్నాడట. అతడే 2025 ఐపీఎల్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా కొనసాగడం దాదాపుగా ఖాయమైంది. ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ అనుమతించే నియమాన్ని ఏర్పాటు చేస్తే రిషబ్ పంత్‌తో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ట్రిస్టన్ స్టబ్స్‌లను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read:-రోహిత్ బెయిల్-స్విచ్ ట్రిక్‌.. ఫలించని ప్రయోగం

2022 లో కార్ ఆక్సిడెంట్ తర్వాత ఐపీఎల్ లో పంత్ రాణించాడు. ఆ తర్వాత భారత టీ20, వన్డే, టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు. చెన్నై వేదికగా తాజాగా ముగిసిన టెస్టులో పంత్ దాదాపు 20 నెలల తర్వాత టెస్ట్ జట్టులోకి వచ్చి సెంచరీ చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ను ఒదిలేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. పంత్ 3284 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.