కులం పేరుతో సమాజంలో విషం చిమ్ముతున్నరు: మోదీ

 

  • అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు
  • గత ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధిని విస్మరించాయి
  • తమ పాలనలో గ్రామాలు సమాన హక్కులు పొందుతున్నాయని కామెంట్​
  • ఢిల్లీలో గ్రామీణ భారత్​మహోత్సవ్– 2025​ ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు సమాజంలో కులం పేరుతో విషాన్ని చిమ్ముతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి కుట్రలను తిప్పికొట్టి.. గ్రామీణ వారసత్వం, సంస్కృతిని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలోని భారత మండపంలో గ్రామీణ భారత్​ మహోత్సవ్​–2025 ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా  మోదీని నాబార్డ్​ చైర్​పర్సన్​ షాజీ కేవీ సత్కరించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోలేదని అన్నారు. దీంతో పట్టణాలకు వలసలు పెరిగిపోయాయని, ఫలితంగా పట్టణంలో పేదరికం పెరిగిందని తెలిపారు. నేటికీ సమాజంలో ఎంత మార్పువచ్చినా.. పట్టణం, గ్రామాల మధ్య అంతరం మాత్రం తగ్గడం లేదని చెప్పారు. 

గ్రామాలను బలోపేతం చేస్తున్నం

2047 నాటికి వికసిత్​ భారత్​ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ తెలిపారు.  గత ప్రభుత్వాల హయాంలో దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలు తమ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని  వ్యాఖ్యానించారు.  2014 నుంచి తాను గ్రామీణ భారతానికి సేవ చేస్తున్నానని తెలిపారు. సమాజ సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని, ఇవి గ్రామీణ భారతంలో కొత్త శక్తిని నింపుతున్నాయని తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా  కోట్లాది మందికి పక్కా ఇండ్లు ఇచ్చామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరు కూడా అందిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఆయుష్మాన్​ ఆరోగ్య మందిర్స్​లో హెల్త్​కేర్​ ఫెసిలిటీస్​ అందజేస్తున్నట్టు చెప్పారు.  డిజిటల్ టెక్నాలజీ సహాయంతో దేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఆసుపత్రులను గ్రామాలకు అనుసంధానించామని తెలిపారు. గ్రామాల్లోని ప్రజలు ప్రస్తుతం టెలీమెడిసిన్ సౌకర్యాలను  పొందుతున్నారని చెప్పారు.  తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల మూలంగా గ్రామీణ భారతంలో పేదరికం దాదాపు 26 శాతం నుంచి 5 శాతానికి తగ్గిందని వెల్లడించారు. ఉద్దేశాలు గొప్పగా ఉంటే.. ఫలితాలు అంత సంతృప్తికరంగా ఉంటాయని, తాము పదేండ్లుగా చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.