- దేశ రాజధానిలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం
- వాతావరణ మార్పుల దృష్ట్యా పలు విమానాల దారి మళ్లింపు
- వారం రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం లేదన్న స్కైమెట్
- ఈ రోజు కూడా వర్షాలు కురిసే సూచన
అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శుక్రవారం మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణిస్తున్న విమానం సహా, మరో 11 విమనాలను దారి మళ్లించారు. విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడటంతో వాటిని లక్నో, జైపూర్, ఆగ్రా, అహ్మదాబాద్ లకు మళ్లించినట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు, టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాల గురించి సమాచారం కోసం పలు ఎయిర్‌లైన్స్‌తో టచ్‌లో ఉండాలని సూచించారు.
ప్రతికూల వాతావరణం కారణంగా, ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. విమాన సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించవలసిందిగా ఢిల్లీ ఎయిర్ పోర్టు తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
Kind attention to all our flyers! #BadWeather #Rain pic.twitter.com/qmhilwCw5m
— Delhi Airport (@DelhiAirport) May 20, 2022
ఇకపోతే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. పంజాబ్, హరియాణా మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. ఇది క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని, దీని ప్రభావంతో ఆదివారం నుంచి వాయువ్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. దీంతో మంగళవారం నాటికి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయని అంచనా వేసింది.
ఒకదాని తర్వాత ఒకటి ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం వల్ల వారం రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం లేదని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెట్ వైస్-ప్రెసిడెంట్ మహేశ్ పలావత్ తెలిపారు.
