84 వేల కోట్లతో అత్యాధునిక వెపన్స్ .. కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం

84 వేల కోట్లతో అత్యాధునిక వెపన్స్ .. కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం

న్యూఢిల్లీ: మన దేశ రక్షణ వ్యవస్థ బలం మరింత పెరగనుంది. 84,560 కోట్ల విలువైన అత్యాధునిక వెపన్స్ కొనుగోలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. యాంటీ ట్యాంక్ మైన్స్, హెవీ వెయిట్ టార్పెడోలు, మల్టీ మిషన్ మారిటైమ్ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు, మౌంటెడ్ గన్ సిస్టమ్స్, మిసైల్స్, బాంబులతో సహా ఇతర రక్షణ సామగ్రి కొనుగోలుకు ఓకే చెప్పింది.

వీటితో పాటు భూకంపాలను గుర్తించే సెన్సర్లు, రిమోట్ డీయాక్టివేషన్ ఫీచర్లతో కూడిన న్యూ జనరేషన్ యాంటీ ట్యాంక్ మైన్​లు కూడా ప్రతిపాదనల్లో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ తుది ఆమోదం వచ్చిన వెంటనే రక్షణ శాఖ వీటిని కొనుగోలు చేయనుంది. ఇందులో చాలావరకు మన దేశీయ సంస్థలు తయారు చేసినవాటిని కొనేందుకు ప్రాధాన్యం ఇస్తామని డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది.

కొత్తగా రానున్న ఎయిర్ డిఫెన్స్ రాడార్​లు తక్కువ ఎత్తులో ఎగురుతున్న టార్గెట్​లను కూడా ఈజీగా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటాయి. నేవీ, కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో నిఘా కోసం మీడియం రేంజ్, మల్టీ మిషన్ మారిటైమ్ విమానాలను కొనుగోలు చేయనున్నారు. నీళ్ల అడుగున శత్రు దేశాలకు చెందిన కల్వరి క్లాస్ సబ్​మెరైన్లను గుర్తించి, వాటిపై దాడి చేసేందుకు సాయపడే హెవీ వెయిట్ టార్పెడోలను తీసుకురానున్నారు.