Diwali 2024 : దీపావళి అంటేనే స్వీట్ల పండుగ కూడా.. మైసూర్ పాక్, కలకండ్, బాదుషా వెరీ వెరీ స్పెషల్.. !

దీపావళి టపాసుల పండుగే కాదు... స్వీట్ల పండుగ కూడా. అందుకే దీపావళి వచ్చిందంటే చాలు ఇంట్లో రెండుమూడు రకాల స్వీట్లు తయారుచేస్తారు చాలామంది. వాటిలో కూడా త్వరగా అయిపోయే పేనీల పాయసం, బెల్లపన్నం చేసుకుంటారు. ఎప్పుడూ ఇవేనా? అని ఇంట్లో వాళ్లు అనకూడదని బయటినుంచి కొన్ని స్వీట్లు కొనుక్కొస్తారు కదా! అలా కాకుండా... ఈ దీపావళికి బయట కొనుక్కొచ్చే స్వీట్లనే ఇంట్లో తయారు చేసుకోండి.

బాదుషా తయారీకి కావలసినవి

  • మైదాపిండి: ఒక కప్పు
  • చక్కెర: ఒక కప్పు
  •  పెరుగు: రెండు టేబుల్ స్పూన్లు
  •  నెయ్యి: నాలుగు టేబుల్ స్పూన్లు
  •  నూనె లేదా నెయ్యి: డీప్ ఫ్రైకి సరిపడా
  • బేకింగ్ పౌడర్ : పావు టీ స్పూన్ 

తయారీ విధానం: మైదాపిండిలో పెరుగు, నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. దాన్ని గంటసేపు నానబెట్టాలి. తర్వాత పిండిని మరోసారి కలిపి, చిన్నచిన్న ఉండలు చేయాలి. అరచేతులకు నెయ్యి రాసుకుని, ఒక్కో ఉండను వత్తాలి. తర్వాత చేతివేలితో దాని మధ్యలో ఇంకొంచెం వత్తాలి. మరో గిన్నెలో చక్కెర, అర కప్పు నీళ్లు పోసి  లేత తీగపాకం పట్టాలి. పాకం తయారయ్యే లోపు బాదుషాలను నూనెలో డీప్​ ఫ్రై చేయాలి. తర్వాత వాటిని పాకంలో వేయాలి. బాదుషాలకు పాకం బాగా పట్టాక బయటికి తీయాలి.

Also Read : ఙ్ఞానం అంటే ఏంటీ.. శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఏంటీ

కలకండ్​ తయారీకి కావలసినవి

  • పాలు:ఒక లీటరు,
  •  చక్కెర: అర కేజీ
  • నెయ్యి: పావు కప్పు

 తయారీ విధానం : కలకండ్ తయారీకి విరిగిన పాలను వాడాలి. దానికోసం పాలను వేడి చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే పాలు విరుగుతాయి. స్టవ్ వెలిగించి పాన్లో చక్కెర, తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టాలి. అందులో విరిగిన పాలు పోసి కలపాలి. పాకం ఇంకాస్త గట్టిపడ్డాక నెయ్యి వేయాలి. రెండు నిమిషాల తర్వాత వెడల్పాటి ప్లేట్ కి నెయ్యి రాసి, పాకాన్ని అందులో పోసి. సమంగా పరచాలి. పూర్తిగా ఆరిన తర్వాత ముక్కలుగా కోయాలి. రుచికరమైన కలకండ్ రెడీ.

మైసూర్ పాక్ తయారీకి కావాల్సినవి

  • శెనగపిండి: రెండు కప్పులు
  • నెయ్యి లేదా డాల్డా: సరిపడా
  • చక్కెర: రెండు కప్పులు 

తయారీ విధానం : శెనగపిండిని నెయ్యిలో అడుగంటకుండా వేగించాలి. మరోగిన్నెలో చక్కెరను లేతపాకం పట్టాలి. ఆ పాకంలో వేగించిన శెనగపిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. అందులో కరగబెట్టిన నెయ్యి లేదా డాల్డా వేయాలి. మిశ్రమాన్ని కలుపుతూ నెయ్యి పోస్తే మాడిపోకుండా ఉంటుంది. అప్పుడు పిండి గుల్లగా తయారవుతుంది. తర్వాత మరోసారి నెయ్యి లేదా డాల్డా వేసి కలపాలి. మిశ్రమాన్ని ఒక పెద్ద ప్లేట్లో మందంగా పోసి ముక్కలుగా చేయాలి. పది నిమిషాల తర్వాత మైసూర్​ పాక్​ను  విడివిడిగా బయటికి తీయాలి.

–వెలుగు, లైఫ్–