బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టుకున్న నల్గొండ యువకుడు.. చివరికిలా చేశాడు..

నల్గొండ: ఆన్లైన్ బెట్టింగ్లో కోట్ల రూపాయల పోగొట్టుకుని.. అప్పులు చేసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండలో వెలుగుచూసింది. నల్గొండ మున్సిపాలిటీలోని నెహ్రూ నగర్కు చెందిన సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాలియా 14  మైల్స్ వద్ద సాగర్ ఎడమ కాల్వలో దూకేశాడు. బెట్టింగ్లో రూ.2  కోట్లు పోగొట్టుకున్న సాయికుమార్, అప్పులు ఎక్కువ కావడంతో సూసైడ్ చేసుకున్నట్లు అతను రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోతో స్పష్టమైంది.

కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలను ఎంత ప్రభావితం చేసిందో అలాగే ఈ ఆన్​లైన్​ జూదం విద్యార్థులను, ఉద్యోగులను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూ వస్తున్నది. కరోనా కాలంలో ఆన్​లైన్లో ఖాళీగా ఉన్న విద్యార్థులు, వ్యాపారాలు ఆగిపోయిన వ్యాపారస్తులు, ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు అంతర్జాలంలో పార్ట్​ టైం ఉద్యోగాలు, మొబైల్ ఫోనుతో డబ్బులు ఎలా సంపాదించాలి అని గూగుల్ను ఆశ్రయించడం ఎక్కువైంది. అలా వారందరి పూర్తి వివరాలు ఆయా వెబ్ సైట్​లకు చేరుతాయి. వారి పేరు, ఫోన్ నంబర్,  ఈ–మెయిల్ ఐడీ  వివరాలను ఒక వెబ్ సైట్ వాళ్ళు ఇంకొక వెబ్​సైట్ వారికి అమ్ముకుంటారు. ఈ సమాచారాన్ని ఆన్లైన్ గేమ్స్,  బెట్టింగ్ నిర్వహించే వారు, సైబర్ నేరగాళ్లు కొనుక్కుంటారు.

ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుని వారి నంబర్లకు, టెలిగ్రాం, వాట్సాప్​లో శుభాకాంక్షలు తెలుపుతూ.. మీరు ఆన్​లైన్​లో డబ్బు సంపాదించే ప్లాట్ ఫామ్ కు ఎంపిక అయ్యారు అంటూ లింక్ పంపిస్తారు. లింక్ ఓపెన్ చేస్తే వాట్సాప్ లేదా టెలిగ్రాం చాట్ లోకి వెళుతుంది. అక్కడ ఇతర దేశాల వ్యక్తుల పేర్లు, ఇతర దేశాల నంబర్లతో వారి వాట్సాప్ , టెలిగ్రాంలు ఉంటాయి. రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఎలా డబ్బులు డిపాజిట్ చెయ్యాలి, ఎలా ఆటలలో ఇన్వెస్ట్ చెయ్యాలి, ఎంత డబ్బు పెడితే ఎంత డబ్బు వస్తుంది, అనే పూర్తి వివరాలు అందిస్తారు. 100 రూపాయల నుండి మొదలుకొని ఎంత డబ్బు అయినా అందులో డిపాజిట్ చేయవచ్చు. ఇందులో కలర్ గేమ్, క్యాసినో, రమ్మి, తీన్ పత్తి ఇలా సుమారుగా 1500కు పైగా వెబ్సైట్లు, అప్లికేషన్​లు ఉన్నాయి.