ప్రింట్​ మీడియానే.. విశ్వసనీయ వార్తలకు జీవిక

వార్తా పత్రికలకు, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందా? జనాభా పెరుగుదలతో  పోలిస్తే  భారతదేశంలో  వార్తాపత్రికల  ముద్రిత వార్తల రీడర్ల తగ్గుదలను సూచిస్తోంది. పత్రికల సర్క్యులేషన్  సంఖ్యలు స్థిరంగా కనిపించినప్పటికీ, వృద్ధిరేటు జనాభా విస్తరణకు అనుగుణంగా లేదు. ప్రింట్ జర్నలిజంలో ఈ క్షీణత  ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుంది.  

భారత్​తో  సమాన సంఖ్యలో  పది లక్షలపైన  సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రికలు జపాన్​లో ఉన్నాయి.  తెలుగు రాష్త్రాలతో  దాదాపు సమాన జనాభా ఉండే జపాన్​లో  ‘యోమియురి షింబున్’,  ‘అసాహి షింబున్’ వంటి జపాన్ వార్తాపత్రికల రోజువారీ  సర్క్యులేషన్  60 లక్షలపై మాటే.  తెలుగు దినపత్రికల సర్క్యులేషన్ 15 లక్షల గరిష్ట స్థాయిని ఇంకా చేరాల్సి ఉంది.  జపాన్​లో  విశ్వసనీయమైన సమాచార  వనరుగా ప్రింట్ మీడియాకు  లభించే  గౌరవానికి  సూచిక అక్కడి ప్రజల ఆదరణ.  

పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో  వార్తాపత్రికల క్లబ్బులకు  ప్రజాదరణ పుష్కలం. ఈ క్లబ్బులు జర్నలిజం, విమర్శనాత్మక  ఆలోచన పట్ల  పౌరులకు అవగాహన కలిగించి,  మీడియా పరంగా అక్షరాస్యతను,  క్రియాశీల పౌరసత్వాన్ని ప్రోత్సహిస్తాయి.

ఆన్​లైన్​ వార్తల వైపు మొగ్గు

ఎక్కువమంది పాఠకులు ప్రస్తుతం  ఉచిత ఆన్​లైన్  వార్తల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే,  ఆన్​లైన్​లో ఉచితంగా చదివే వార్తల వెనుక అల్గోరిథమ్ వంటి భారీ మూల్యం ఉంటుంది.  సోషల్ మీడియా వేదికలలోనూ ఈ అల్గోరిథమ్ ఉపయోగిస్తారు.  వార్తలను, అభిప్రాయాలను  కాలక్రమానుసారం కాకుండా,  అమర్యాదగా,  ఆవేశ పూరితంగా ఉండే పోస్టులను ప్రదర్శించడం.. తద్వారా రీడర్లను  ఎక్కువ సమయం తమ వేదికలోనే గడిపేట్లు చేస్తారు.

సంచలనాత్మక, క్లిక్- ఆధారిత వార్తలకే ప్రాధాన్యత లభిస్తుంది. ఇది తప్పుడు సమాచారం వ్యాప్తికి దారితీస్తుంది. అంతేగాక, ఆన్​లైన్ వార్తావేదికలు.. సాధారణంగా 
వినియోగదారులకు అప్పటికే చదవడానికి ఆసక్తి ఉన్న వార్తలను మాత్రమే అందించడానికి అల్గారిథమ్ ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, సినీ వార్తలు చదివే వ్యక్తికి ఎక్కువగా సినీ వార్తలు,  ఒక సిద్ధాంతానికి అనుకూల వార్తలు చదివే వ్యక్తికి అవే వార్తలు తెరపై కనిపించడం వల్ల పాఠకులు.. విస్తృత శ్రేణి సమగ్ర సమాచారానికి దూరం అవుతారు.


ఉచిత ఆన్​లైన్ వార్తలపై ఆధారపడటం ద్వారా, పాఠకులు తెలియకుండానే  ఖచ్చితత్వం కంటే ఆకర్షణతకు విలువనిచ్చే వ్యవస్థకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇది పాత్రికేయ వృత్తిని బలహీనపరుస్తుంది.  ప్రింట్ మీడియాకు మద్దతు ఇవ్వకపోతే,  వైజ్ఞానిక సమాజం  కీలకమైన మూలస్తంభాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు, ప్రింట్ న్యూస్ పేపర్లు కనుమరుగైతే ఆన్​లైన్ వార్తల భవిష్యత్తు కూడా ప్రమాదంలో  పడే అవకాశం ఉంది. ఆన్​లైన్​ వార్తా వేదికలు  సంప్రదాయ ప్రింట్ మీడియా అందించే పరిశోధనాత్మక,  నాణ్యమైన రిపోర్టింగ్​పై  ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. 

ఆస్ట్రేలియాలో చట్టం

ప్రింట్ మీడియాకు ఎదురవుతున్న సవాలును గుర్తించిన ఆస్ట్రేలియా జర్నలిజాన్ని కాపాడేందుకు సాహసోపేత చర్యలు చేపట్టింది.  2021లో  ఆస్ట్రేలియా ట్రెజరీ చట్టాల సవరణ (న్యూస్ మీడియా, డిజిటల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ల తప్పనిసరి బేరసారాల కోడ్) చట్టం 2021ను  ప్రవేశపెట్టింది.  ఇది ప్రపంచంలోనే  ప్రజా ప్రయోజన జర్నలిజంను  కాపాడేందుకు ఉద్దేశించిన మొదటి చట్టం.

గూగుల్, ఫేస్ బుక్ వంటి టెక్ దిగ్గజాలు వార్తలను షేర్ చేసినందుకు సంప్రదాయిక వార్తా సంస్థలకు రుసుం చెల్లించాలని ఈ చట్టం చెబుతోంది. ఆస్ట్రేలియా విజయంతో  కెనడా, ఇండోనేషియా కూడా ఇదే విధమైన చట్టాలను ప్రతిపదిస్తున్నాయి. నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవ ప్రసంగంలో,  కేంద్ర  సమాచార,  ప్రసార శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్  సంప్రదాయ మీడియా సంస్థల వార్తల విలువకు తగిన పరిహారం ఆన్ లైన్ మీడియా చెల్లించాలని వ్యాఖ్యానించారు. భారత్ కూడా ఆస్ట్రేలియా చొరవను పరిశీలించాలి.  ఇందుకు ప్రభుత్వం, మీడియా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. 

శాశ్వత సాక్ష్యంగా ప్రింట్​ వార్తా పత్రికలు

అధికారులను జవాబుదారీగా ఉంచడానికి, జర్నలిజంలో తమ వనరులను పెట్టుబడి పెట్టడానికి ప్రింట్ మీడియా వార్తాపత్రికలు దోహదపడతాయి.  వార్తాపత్రికలు లేకపోతే, ఆన్​లైన్ వార్తల నాణ్యత కూడా గణనీయంగా తగ్గుతుంది.  ఇది సంచలనాత్మకత,  తప్పుడు సమాచారంతో నిండిన వార్తా ప్రపంచానికి దారితీస్తుంది.  ప్రింట్ వార్తాపత్రికలు ప్రజలకు సమాచారం చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.  ఆన్​లైన్ వేదికల  వేగవంతమైన, క్లిక్- ఆధారిత స్వభావానికి  భిన్నంగా,  ప్రింట్ వార్తాపత్రికలు వర్తమాన సంఘటనల సమగ్ర వార్తాకథనాలను అందిస్తాయి.  సంక్షిప్త ఆన్​లైన్ కథనాలు,  సోషల్ మీడియా పోస్టుల్లో  కానరాని లోతైన రిపోర్టింగ్ 
 ప్రింట్ జర్నలిజం అందిస్తుంది.

విశ్వసనీయ జర్నలిజానికి మద్దతివ్వాలి

ముఖ్యంగా వార్తాపత్రికలకు చందాదారులు అవ్వడం ద్వారా వార్తల విలువను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి కుటుంబం కనీసం ఒక వార్తాపత్రికను కొనడం ద్వారా, విశ్వసనీయ జర్నలిజానికి మద్దతు ఇవ్వాలి. సర్క్యులేషన్ పెరుగుతున్న కొద్దీ వార్తా పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం పెరిగి, స్వతంత్ర జర్నలిజానికి అవసరమైన నిధులు సమకూరతాయి.  ప్రజాస్వామ్యంలో పాల్గొనడం అంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు.  

విశ్వసనీయ పాత్రికేయతకు మద్దతు ఇవ్వడం, తగిన సమాచార పరిజ్ఞానం కలిగి ఉండటం కూడా పౌరుల బాధ్యత. ముద్రిత పత్రికలకు మద్దతు ఇవ్వడం మన అందరి బాధ్యత. భారతదేశంలోని ప్రతి ఇంట ఒక ప్రింట్ వార్తాపత్రిక ఉండేలా ప్రోత్సహించే ప్రచారానికి ఇది తగిన సమయం. మన ప్రజాస్వామ్య భవిష్యత్తు పత్రికారంగంపై ఆధారపడి ఉందనేది గమనార్హం.

వార్తల విశ్వసనీయత ప్రింట్​ మీడియాకే సాధ్యం 

వార్తాపత్రికలు  సంపాదకీయ ప్రమాణాలను పాటిస్తాయి.  విశ్వసించదగిన,  ధృవీకరించబడిన సమాచార వనరులైన పత్రికలు లేకపొతే  పౌరులు తప్పుడు సమాచారం, సంచలన వార్తలతో నిండిన డిజిటల్ వార్తా ప్రపంచంలో మునిగిపోయే  ప్రమాదం ఉంది.  ముద్రిత వార్తాపత్రికలు సత్య సమాచార శాశ్వత సాక్ష్యంగా నిలిచే దస్తావేజుగా పనిచేస్తాయి.  అదే ఆన్​లైన్​ వార్తా కథనాలనైతే సవరించవచ్చు, తొలగించవచ్చు లేదా కోల్పోవచ్చు.  

ఫేక్ న్యూస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ యుగంలో వార్తల విశ్వసనీయ వనరుగా ప్రింట్ మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. మరోపక్క, రీడర్లు ఎక్కువగా ఉచిత ఆన్​లైన్​ న్యూస్ అగ్రిగేటర్లను ఎంచుకున్నప్పుడు మీడియా సంస్థలు ఆదాయాన్ని కోల్పోతాయి. ఈ మార్పు సంప్రదాయ మీడియా సంస్థల ఆర్థిక సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. అది విశ్వనీయ వార్తల తీవ్రమైన కొరతకు దారితీస్తుంది.

-శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు  పరిశోధకుడు-