పట్టణాల్లో ప్రాణవాయువు కొరత

ప్రతి  సంవత్సరం  శీతాకాలంలో  ఉత్తర భారతదేశ  మహా నగరాలు వాయు కాలుష్యంతో  కొట్టుమిట్టాడుతున్నాయి.  ముఖ్యంగా  దేశ రాజధాని  ఢిల్లీ ఎదుర్కొనే అతిపెద్ద పర్యావరణ సమస్య 'వాయు కాలుష్యం'.  ఇతర కాలాలతో పోలిస్తే  చలికాలంలో భారతదేశంలో వాయు కాలుష్యం  పరిమితి మించి తీవ్రస్థాయిలో ఉంటుంది. దీనికి కారణం, వాతావరణ పరిస్థితులు, శీతాకాలంలో పర్వతాల నుంచి  వచ్చే చల్లని గాలి  వాయుకాలుష్య కారకాలను  బంధించటం,  చలి వలన వ్యక్తిగత ప్రయాణ వాహనాలు, కార్లు వంటివి ఎక్కువగా  వాడటం కూడా కాలుష్య స్థాయులు పెరగడానికి కారణం అవుతున్నాయి. 

దేశవ్యాప్తంగా జరుపుకునే  దీపావళి వేడుకల్లో బాణసంచా వినియోగించడంతో వాయు కాలుష్యం మరింతగా పెరుగుతోంది. పొగ, మంచు కలిసి   పొగమంచుగా ఏర్పడటం, అదేవిధంగా  పల్లెలలో  వ్యవసాయ వ్యర్థాలను  మండించటం  మొదలగు కారణాల వలన  శీతాకాలంలో భారతదేశంలో  వాయు కాలుష్యం చాలా తీవ్రస్థాయిలో  ఉంటుంది.  ఢిల్లీ ప్రజల జీవనంపై వాయుకాలుష్యం చూపుతున్న ప్రభావం చిన్నది కాదు. ఢిల్లీని చుట్టేస్తున్న కాలుష్య కారకాలు ఎంత ప్రమాదకరంగా మారాయో అందరికీ అర్థమవుతున్న విషయమే. .

గాలి వాయువుల మిశ్రమం 

వాయువుల మిశ్రమంలో   నైట్రోజన్ వాయువు  78%,  ఆక్సిజన్ 21% ,  కార్బన్ డయాక్సైడ్  0.04%,  మిగిలిన కొద్ది శాతం మిథేన్,  నైట్రస్ ఆక్సైడ్,  నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు ఉంటాయి.  అయితే,  ఈ వాయువులు భూమి మీద గల జీవరాశుల మనుగడకు ఉపయోగకరమయినవే.  ఉదాహరణకు కార్బన్ డయాక్సైడ్ వాయువు కిరణజన్యసంయోగ క్రియ ద్వారా  ఆహారం  తయారుచేయుటలో  కీలక పాత్ర పోషిస్తోంది.  గ్రీన్ హౌస్  ప్రభావాన్ని కలుగ చేయటం  వలన  భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్​  ఉంచి  నివాస యోగ్యంగా మార్చటంలో ఉపయోగపడుతుంది.  లేనిచో  భూమి  సగటు ఉష్ణోగ్రత  పెరిగి  నివాసయోగ్యంగా ఉండేది కాదు. 

పొల్యూటెడ్​ గాలితో..

అదేవిధంగా  ఆక్సిజన్  వాయువు  అనంత  జీవకోటికి  ప్రాణవాయువును  అందిస్తోంది.   నైట్రోజన్  వాయువు   కండరాల  నిర్మాణానికి  అవసరం  ఆయన ప్రోటీన్స్ తయారీలో  కీలకపాత్ర  వహిస్తుంది.  కానీ,  ఈ వాయువుల   సమతుల్యత,  పరిమాణం  మారినప్పుడు  భూమిపై గల  జీవరాశి  మనుగడకు ఈ వాయువులు  ప్రమాదకారిగా మారిపోతాయి.  ఇవి  వాయు కాలుష్యాన్ని,  వాతావరణ  మార్పులను  కలగజేస్తాయి.  వాయు కాలుష్యం  ప్రక్రియలో సహజ  స్థాయి కంటే  ఎక్కువ  లేదా  సహజమైన దానికంటే ఎక్కువ కాలంపాటు గాలిలో కాలుష్య కారకాలు ఉండి జీవరాశులపై   ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.  

లంగ్స్​పై ప్రభావం​ 

అసురక్షిత  గాలి  నాణ్యతకు  గురికావడం వల్ల   ఊపిరితిత్తులకు  సంబంధించిన అనారోగ్యానికి గురవుతాయి. తద్వారా మరణాల రేటు పెరిగిపోతుంది.  ఒక్కప్పుడు ధూమపానం చేసేవారికి పరిమితమైన  ‘లంగ్ క్యాన్సర్’  ధూమపానం చేయనివారికి కూడా వాయు కాలుష్యం వలన సంక్రమిస్తున్నది.  మితమైన గాలి  కాలుష్యానికి గురయ్యే వ్యక్తులకు 4%  ప్రమాదం పెరిగితే,   ప్రమాదకర స్థాయిలను  ఎదుర్కొంటున్నవారికి ప్రమాదం  24% పెరుగుతుంది.

ప్రథమ స్థానంలో లాహోర్​

నవంబర్ 14, 2024 ఉదయం నాటికి 'ఐ.క్యూ.ఎయిర్ కంపెనీ'   లైవ్  ర్యాంకింగ్స్ ద్వారా రికార్డ్ చేసిన అధ్వాన  గాలి నాణ్యత సూచిక ఉన్న ప్రపంచవ్యాప్త టాప్ 10 నగరాలలో లాహోర్ (పాకిస్తాన్)   అత్యంత కలుషిత నగరంగా    మొదటి  స్థానాన్ని పొందింది.  రెండవ స్థానంలో  ఢిల్లీ,  మూడో స్థానంలో  బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా, నాలుగో  స్థానంలో  హనోయి(వియత్నాం), ఐదో  స్థానంలో  కొలకత్తా  ఉన్నాయి. 'ఐ.క్యూ.ఎయిర్’ అనేది గాలి నాణ్యత సాంకేతికతలో ప్రత్యేకత కలిగిన స్విస్ కంపెనీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ)  ప్రతి సంవత్సరం  ఏడు మిలియన్ల మరణాలకు వాయుకాలుష్యం కారణమని పేర్కొంది.  

పెరుగుతున్న మరణాలు

సగటున, ఈ నగరాల్లో  సంభవించే 7.2%, రోజువారీ మరణాలకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ  మార్గదర్శకాలను మించిన పార్టిక్యూలేట్ మ్యాటర్ 2.5 ఉండటమే  కారణమని తెలియవచ్చినది. పార్టిక్యూలేట్ మ్యాటర్2.5 కాలుష్యంతో సంబంధం ఉన్న మరణాలలో అత్యధిక భాగం  ఢిల్లీలో సంభవిస్తున్నట్లు వెల్లడైంది. పార్టిక్యూలేట్  మ్యాటర్2.5 కాలుష్యం.. ఢిల్లీ,  బెంగళూరుతో సహా భారతీయ నగరాల్లో  ప్రతి  సంవత్సరం 33,000 మంది ప్రాణాలను తీస్తుంది.  ఈ నగరాల్లో ప్రతిరోజూ పార్టిక్యూలేట్ మ్యాటర్ 2.5 కాలుష్యానికి గురిఅయ్యే  వారిలో  మరణాల  ప్రమాదం గణనీయంగా పెరిగిందని ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌‌‌‌‌‌‌‌'అధ్యయనం కనుగొంది. 

పార్టిక్యూలేట్  మ్యాటర్2.5.  అంటే..

పార్టిక్యూలేట్  మ్యాటర్2.5.  అంటే,  గాలిలో 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ  వెడల్పు ఉన్న  చిన్నచిన్న కాలుష్య  కణాలు.  పార్టిక్యూలేట్ మ్యాటర్ 2.5  కణాలు పరిశ్రమ, నివాస, వ్యవసాయం, రవాణా, అటవీ మంటలు, అగ్నిపర్వత  విస్ఫోటనాలు నుంచి  విడుదల అవుతాయి. ఈ పరిశోధన  దేశరాజధాని ఢిల్లీ,  కర్నాటక రాజధాని  బెంగళూరు,  తమిళనాడు రాజధాని  చెన్నై,   దేశ ఆర్థిక రాజధానిగా పేరుపొందిన  ముంబై,  తెలంగాణ రాజధాని హైదరాబాద్,  పశ్చిమబెంగాల్ రాజధాని  కోల్‌‌‌‌‌‌‌‌కతా వంటి మహా నగరాలతోపాటు  అహ్మదాబాద్, పూణే,  వారణాసిలో,  సిమ్లా వంటి పది  మహానగరాలలో  సుమారు పదకొండు సంవత్సరాలపాటు సంభవించిన మరణాల డేటాను విశ్లేషించింది. 

వ్యర్థాలను కాల్చొద్దు

వాయు కాలుష్యం  వలన  గ్రామాలతో  పోలిస్తే,   పట్టణ  ప్రాంతాలలో  ప్రాణవాయువు పరిమాణం తగ్గిపోతున్నట్లుగా పరిశోధనలు  తెలియజేస్తున్నాయి. అంటే,  పట్టణాలలో  ప్రాణవాయువు  కొరత ఉన్నట్టుగా  స్పష్టం అవుతున్నది.  వాయుకాలుష్యం వలన గ్లోబల్ వార్మింగ్,  వాతావరణ మార్పులు  సంభవిస్తాయి. ఈ పరిణామాలను వీలైనంత మేరకు  నివారించాలి అంటే  పంట వ్యర్థాలను,   ప్లాస్టిక్ వస్తువులు,   టైర్స్ మొదలగు ఇతర వ్యర్థాలను   కాల్చకూడదు.  వాహనాలలో,  పరిశ్రమలలో,  విద్యుత్ ఉత్పత్తికి  శిలాజ  ఇంధనాల స్థానంలో పునరుత్పాదక ఇంధనాలను వినియోగించాలి.  అదేవిధంగా ప్రభుత్వం అమలుచేసే  వాయుకాలుష్య నివారణ కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాల్సిన అవసరం ఉంది. 

ఓ ‘హెల్త్ జర్నల్‌‌‌‌‌‌‌‌’అధ్యయనం  ప్రకారం..

ఆర్గనైజేషన్  ఫర్  ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్,   వరల్డ్  బ్యాంక్  ప్రాజెక్ట్  వాయుకాలుష్యం వల్ల 2060 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, సంవత్సరానికి $18–25 ట్రిలియన్ల నష్టం వాటిల్లనున్నట్లు తెలిపింది.  ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌‌‌‌‌‌‌‌' లో ప్రచురించబడిన (2024వ  సంవత్సరం) ఒక అధ్యయనం ప్రకారం,  ఢిల్లీ,  బెంగళూరు,  ముంబై వంటి  ప్రధాన నగరాల్లో అధికస్థాయి  పార్టిక్యూలేట్ మ్యాటర్ 2.5 (నలుసు పదార్థం 2.5)  వలన ఏర్పడే  వాయుకాలుష్యంతో  రోజువారి  మరణాలు  గణనీయమైన స్థాయిలో  పెరిగినాయి. 

- డా.శ్రీధరాల రాము,
ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్