అత్యాచారం హత్య కేసులో.. నిందితుడి ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్పు

  • సంగారెడ్డి ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు తీర్పును సవరించిన హైకోర్టు

హైదరాబాద్‌, వెలుగు: సంగారెడ్డి జిల్లా బీడీఎల్‌లో ఐదేండ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో 62 ఏండ్ల వ్యక్తికి కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అయితే క్షమాభిక్ష, రెమిషన్‌ తదితరాల పేరుతో 30 ఏండ్ల పాటు నిందితుడిని జైలు నుంచి విడుదల చేయరాదని ఆదేశించింది. అంతేగాకుండా, 15 ఏండ్ల పాటు ఎలాంటి పెరోల్‌పై విడుదల చేయకూడదని చెప్పింది.

2023 అక్టోబరు 16న వెలిమల గ్రామంలో ఐదేండ్ల బాలికను అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన కేసులో గఫార్‌ అలీకి సంగారెడ్డి ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధిస్తూ ఈ ఏడాది సెప్టెంబరులో తీర్పు చెప్పింది. మరణశిక్ష ధ్రువీకరణ నిమిత్తం సంగారెడ్డి కోర్టు రికార్డులను హైకోర్టుకు పంపగా, దోషి గఫార్‌ అలీ అప్పీలు దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు బెంచ్‌ విచారణ చేపట్టింది.

నిందితుడు గఫార్‌ 62 ఏండ్ల వృద్ధుడని, గతంలో అతనికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం, ఉద్దేశపూర్వకంగా చంపాలని పథకం లేకపోవడం, అత్యాచారం తర్వాత హింసకు గురై బాలిక మృతి చెందిందని డాక్టరు ధ్రువీకరించకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువరించింది.