రైతు బీమా డబ్బుల కోసం చావు డ్రామా.. భర్త బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్య .. మెదక్ జిల్లాలో ఘటన

  •  ఒకే ఊరిలో ఇద్దరి మోసం
  •  ఆలస్యంగా వెలుగు చూసిన అక్రమం
  •  పోలీసులకు ఏఈఓ ఫిర్యాదు

మెదక్ జిల్లా : రైతు బీమా డబ్బుల కోసం చావు డ్రామా ఆడారు. బతికుండగానే చనిపోయినట్టు నమ్మించి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు బీమా కింద అందించే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని పొందారు. ఇలా ఒకే గ్రామంలో ఇద్దరు అక్రమంగా రైతు బీమా సొమ్ము పొందడం గమనార్హం. ఈ అక్రమం మెదక్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. రాజ్ పల్లి క్లస్టర్ ఏఈఓ భార్గవి  పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
 మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీను  బతికుండగానే 2021లో చనిపోయినట్టు భార్య  జ్యోతి  గ్రామ  సెక్రటరీ నుండి  డెత్ సర్టిఫికెట్ తీసుకుని రైతు బీమాకు దరఖాస్తు చేసింది. డెత్ సర్టిఫికెట్ ఆధారంగా పిట్ల శ్రీను చనిపోయినట్టు నమ్మిన అధికారులు రైతు బీమా క్లెయిమ్ చేసి ఎల్ఐసీకి ప్రపోజల్ పంపారు. ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షలు మంజూరవ్వగా ఆ మొత్తాన్ని జ్యోతి తీసుకుంది. 

ALSO READ | సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

అలాగే అదే గ్రామానికి చెందిన ఎలిగడి మల్లేశం కూడా బతికి ఉండగానే 2023లో చనిపోయినట్టు అతని భార్య శేఖవ్వ  రైతు బీమాకోసం దరఖాస్తు చేసింది.  డెత్ సర్టిఫికెట్ ఆధారంగా మల్లేశం కూడా చనిపోయినట్టు నమ్మిన ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని శేఖవ్వ తీసుకుంది. 
ఈ నెల14న  గుట్టకింది పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ వ్యవహారంపై పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేశాడు. దీంతో సెక్రటరీ విచరాణ చేయగా పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం ఇద్దరూ బతికే ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. 

దీంతో అధికారులను తప్పుదోవ పట్టించి, అక్రమ పద్దతుల్లో రైతు బీమా పొందిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి సహకారం కూడా ఉన్నట్టు తెలిసింది.