రైతు బీమా కోసం చావు డ్రామా..డెత్ సర్టిఫికెట్ తెచ్చి డబ్బలు కాజేశారు

  • చనిపోయినట్లు సర్టిఫికెట్‌‌ తీసుకొని రైతు బీమా డబ్బులు కాజేసిన ఇద్దరు వ్యక్తులు
  • మెదక్‌‌ జిల్లా గుట్టకిందిపల్లిలో వెలుగులోకి...

మెదక్, వెలుగు : ఇద్దరు రైతులు.. తాము బతికుండగానే డెత్‌‌ సర్టిఫికెట్‌‌ సృష్టించుకొని రైతు బీమా డబ్బులు కాజేశారు. మెదక్‌‌ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో జరిగిన ఈ మోసం ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే... గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీను 2021లో చనిపోయినట్లు అతడి భార్య జ్యోతి విలేజ్‌‌ సెక్రటరీ నుంచి డెత్‌‌ సర్టిఫికెట్‌‌ తీసుకుంది. దీని ఆధారంగా రైతు బీమా కోసం అప్లై చేయగా ఎల్‌‌ఐసీ నుంచి రూ. 5 లక్షలు మంజూరు కావడంతో వాటిని తీసుకుంది. అలాగే అదే గ్రామానికి చెందిన ఎలిగడి మల్లేశం అనే వ్యక్తి కూడా 2023లో చనిపోయినట్లు అతడి భార్య శేఖవ్వ డెత్‌‌ సర్టిఫికెట్‌‌ తీసుకొని రైతు బీమాకు అప్లై చేసుకోవడంతో ఆమెకు కూడా రూ. 5 లక్షలు మంజూరు అయ్యాయి. అయితే పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం బతికే ఉన్నప్పటికీ డెత్‌‌ సర్టిఫికెట్లు తీసుకొనిర రైతు బీమా పొందారని ఈ నెల 14న గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏఈవో భార్గవికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె గ్రామానికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఇద్దరూ బతికే ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె మెదక్‌‌ రూరల్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తప్పుడు డెత్‌‌ సర్టిఫికెట్ల ద్వారా రైతు బీమా సొమ్ము కాజేసిన వ్యవహారంలో గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి సహకారం ఉన్నట్లు ప్రచారం 
జరుగుతోంది.