సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. మృతదేహాన్ని 3 కి.మీలు లాక్కెళ్లిన కారు

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతదేహాన్ని ఓ కారు 3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. కాగా మృతుడిని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్‌ తండాకు చెందిన మెగావత్‌ వెంకటేశ్‌(22)గా  పోలీసులు గుర్తించారు. వెంకటేశ్ మియాపూర్‌లో ఉంటూ ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడని.. జహీరాబాద్‌కు పని నిమిత్తం ఆదివారం బైక్‌పై వచ్చాడని తెలిపారు. 

అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్న క్రమంలో మునిపల్లి మండలం లింగంపల్లి శివారులో ఓ దాబా వద్ద వెంకటేశ్‌ బైక్‌ను ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది.  అంతలోనే రోడ్డుపై వెళ్తున్న  మరో కారు  కింది భాగంలో క్షతగాత్రుడు చిక్కుకుపోయాడు. అది గమనించని కారు డ్రైవర్  మూడు కిలోమీటర్ల దూరం మృతదేహాన్ని ఈడ్చుకెళ్లాడు. ఐతే కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది కారుకు చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని గమనించి ఆపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.