David Warner: వార్నర్‌పై 'కెప్టెన్సీ' నిషేధం ఎత్తివేత

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా(CA) విధించిన 'జీవితకాల కెప్టెన్సీ' నిషేధాన్ని ఎత్తివేసింది. తనపై విధించిన నిషేధాన్ని తొలగించాలని వార్నర్.. సీఏని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దీనిపై విచారించిన సమీక్ష ప్యానెల్ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. వార్నర్ ఇప్పటికే శిక్ష అనుభవించాడని, చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడని సమీక్ష ప్యానెల్ పేర్కొంది.

Also Read :- జియో నుంచి దీపావళి గిఫ్ట్

ఎందుకీ నిషేధం..?

శాండ్‌పేపర్‌గేట్ అని పిలువబడే ఈ బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం 2018లో ఆస్ట్రేలియా జట్టు.. దక్షిణాఫ్రికాలో పర్యటించిన సమయంలో చోటుచేసుకుంది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. కీలకమైన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు బంతిని ట్యాంపరింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ముందుగా బాన్‌క్రాఫ్ట్ ఒక సాండ్‌పేపర్ ముక్కను జేబులో పెట్టుకురాగా.. ఆ పేపర్ సాయంతో మైదానంలో బంతి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారంలో అతనికి అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మద్దతు పలికారు.

ఈ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం కెమెరాలో బంధించబడటంతో వీరి బాగోతం బయటపడింది. ఆపై మ్యాచ్ ముగిశాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాన్‌క్రాఫ్ట్ తప్పును(సాండ్‌పేపర్‌ ఉపయోగించడం) అంగీకరించాడు. ఈ ఘటన తరువాత క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు.. బాన్‌క్రాఫ్ట్‌, వార్నర్‌లపై జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధించింది.

సిడ్నీ థండర్స్ నాయకుడిగా. 

జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంతో రాబోయే బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు అతను నాయకత్వం వహించే అవకాశం దక్కింది. అయితే,  సిడ్నీ థండర్స్ మేనేజ్మెంట్ ఆతనికి కెప్టెన్సీ ఇస్తుందా..! లేదా అనేది తెలియాలి. గడిచిన ఎడిషన్‌లో సిడ్నీ థండర్స్ కెప్టెన్ గా క్రిస్ గ్రీన్ బాధ్యతలు నిర్వర్తించాడు.