డీఏపీ టెన్షన్​ కొరతపై ప్రచారం .. రైతుల్లో ఆందోళన

  • ప్రభుత్వం ముందస్తు చర్యలు
  • ప్రత్యామ్నాయ ఎరువులపై సూచనలు
  • డీలర్లతో అగ్రికల్చర్​ ఆఫీసర్ల మీటింగ్​

యాదాద్రి, వెలుగు : యాసంగి పంటల సీజన్ మొదలైంది. పంటలకు వాడే డై అమ్మోనియం పాస్పెట్ (డీఏపీ) కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డీఏపీ కోసం రైతులు క్యూ కడుతున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే డీఏపీ ప్రత్యామ్నాయంగా ఇతర ఎరువులను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

డీఏపీపై రైతుల ఆందోళన..

జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాల కారణంగా డీఏపీ తయారీతోపాటు దిగుమతి విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఈ యాసంగి సీజన్​లో డీఏపీ కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావించింది. అయితే కొరత ఏర్పడుతుందని ప్రచారం మొదలుకాగానే ఇతర రాష్ట్రాల్లోని రైతులు తమ అవసరానికి మించి డీఏపీ కొనుగోలు చేస్తున్నారు. దీనికోసం పంజాబ్, హర్యానా రైతులు క్యూలు కడుతున్నారు. దీంతో ఇక్కడి రైతులు కూడా డీఏపీ కొరత విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. 

సర్కారు ముందు చూపు..

యాసంగి సీజన్ సాగుపై సర్కారు ముందు చూపుతో వ్యవహరిస్తోంది. ఈ సీజన్​లో సాగు చేస్తున్న పంటలకు డీఏపీ ఎంత అవసరం, ఎంత స్టాక్ ఉందో ప్రభుత్వం లెక్కలు తెప్పించుకుంది. అయితే అవసరమయ్యే డీఏపీకి అందుబాటులో ఉన్న స్టాక్​కు తేడా ఉంది. దీంతో ముందు జాగ్రత్తగా డీఏపీకి ప్రత్యామ్నాయంగా వాడాల్సిన ఎరువులను సూచించింది. 

Also Reafd :- వృద్ధురాలికి వాట్సప్ కాల్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 4 కోట్లు దోపిడీ 

ప్రత్యామ్నాయంగా..

ప్రభుత్వ ఆదేశాలతో అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్​రంగంలోకి దిగింది. ఎరువుల డీలర్లతో సమావేశాలు నిర్వహించింది. డీఏపీ కొరత ఏర్పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డీఏపీకి బదులు ప్రత్యామ్నాయం ఎరువుల గురించి రైతులకు అవగాహన కల్పించాలని డీలర్లకు సూచించారు. డీఏపీలో నత్రజని, భాస్వరమే ఉంటుంది. కాంప్లెక్స్​ఎరువుల్లో కూడా నత్రజని, భాస్వరమే ఉన్నందున వాటిని వాడాలని సూచిస్తున్నారు. లిక్విడ్ నానో డీఏపీ, సింగిల్ సూపర్ పాస్టెట్ వాడాలని చెబుతున్నారు. మట్టిలోని పాస్పరస్​ పంటలకు ఉపయోగపడే విధంగా పీఎస్ బీ ఉపయోగించాలని సూచిస్తున్నారు. 

జిల్లాలో స్టాక్​తక్కువే..

యాదాద్రి జిల్లాలో ఈ యాసంగి సీజన్​లో అన్ని పంటలు కలిపి 3.19 లక్షల ఎకరాలు సాగు చేస్తారని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 2.98 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేయనున్నారని లెక్కలు వేశారు. ఈ సీజన్​లో సాగు చేస్తున్న పంటలకు మొత్తంగా 10 వేల టన్నుల యూరియా అవసరం పడుతుంది. ఇది ఒక్కో నెలకు ఎంత అవసరమో ఆ స్థాయిలో ఎప్పటికప్పుడు స్టాక్​తెప్పిస్తారు. 

నవంబర్​నెలకు మూడు వేల టన్నుల డీఏపీ అవసరమని ఇండెంట్​పెట్టారు. జిల్లాలో ఇప్పుడు 579 టన్నుల డీఏపీ మాత్రమే అందుబాటులో ఉంది.  ఇందులో డీలర్ల వద్ద 406 టన్నులు, సొసైటీల వద్ద 153 టన్నులు, టీఎస్​ మార్క్​ఫెడ్​ వద్ద 19 టన్నులు స్టాక్ ఉంది. దీంతో డీఏపీ విషయంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. అవసరమైన సమయానికి డీఏపీ అందుతుందా..? అని అనుమాన పడుతున్నారు. సమయానికి డీఏపీ అందుతుందని అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు చెబుతున్నారు. 

సమయానికి అందుతాయి 

యాసంగి సీజన్​కు అవసరమైన డీఏపీపై ఆందోళన అవసరం లేదు. ఇప్పటికీ ఇంకా సీజన్​ఊపందుకోలేదు. అవసరమైన సమయంలో అందుబాటులోకి వస్తుంది. డీఏపీలో నత్రజని, భాస్వరం ఉన్నట్టే.. ఇతర కొన్ని ఎరువుల్లో ఇవే రెండూ ఉన్నాయి. అవసరమైన పక్షంలో ఎస్ఎస్​పీ, లిక్విడ్ నానో వాడుకోవచ్చు.

గోపాల్, డీఏవో, యాదాద్రి