గ్రేటర్ హైదరాబాద్​లో డేంజర్ బెల్స్

  • సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర స్థాయికి పొల్యూషన్​
  • ఈ నెల 25న 298కి చేరినఎయిర్​క్వాలిటీ ఇండెక్స్
  • ఢిల్లీ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడంతో కలవరం 
  • చెట్ల నరికివేత, చెత్త కాల్చడం, బ్లాస్టింగ్స్​తో తీవ్ర కాలుష్యం
  • పట్టించుకోని బల్దియా, పీసీబీ, ఫారెస్ట్ శాఖలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ లో గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతున్నది. ఇండస్ట్రియల్ ఏరియాలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. సనత్ నగర్ ఇండస్ట్రియల్​ఏరియాలో గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఇక్కడ ఢిల్లీ స్థాయికి గాలి నాణ్యత దిగజారిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 298కి చేరుకుంది. గ్రేటర్​హైదరాబాద్ లోని 14 ప్రదేశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీని మానిటరింగ్ చేస్తూ ఉంటుంది.ఇందులో సనత్ నగర్ ఏరియాలో ఈ నెల 22, 23, 24, 25 తేదీల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఆయా తేదీల్లో వరుసగా 254, 253, 274, 298గా నమోదైంది. మరోవైపు సిటీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఎయిర్​క్వాలిటీ పడిపోతున్నది. కొన్ని ఏరియాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్​మోడరేట్ గా నమోదవుతున్నది. ఆ ప్రాంతాల్లో జూపార్క్, ఐడీఏ పాశమైలారం, ఇక్రిశాట్​పటాన్​చెరు, సెంట్రల్​వర్సిటీ, బొల్లారం లాంటి ఏరియాలు ఉన్నాయి. మంగళవారం జూపార్క్​-వద్ద 161, ఐడీఏ పాశమైలారం- వద్ద160, ఇక్రిశాట్​పటాన్​చెరు- వద్ద 151, సెంట్రల్​యూనివర్సిటీ- వద్ద 126, బొల్లారం వద్ద-118గా ఏక్యూఐ నమోదైంది. సాధారణంగా ఎయిర్​క్వాలిటీ ఇండెక్స్​-100 వరకు ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్టు. అంతకుమించి లెవెల్స్ పెరిగేకొద్దీ మోడరేట్​గా, పూర్​, వెరీ పూర్, సివియర్​గా చెప్తారు. ఈ క్రమంలోనే సనత్​నగర్​లో ఈ నెల 22 నుంచి 25 వరకు ఎయిర్​క్వాలిటీ ఇండెక్స్​200 నుంచి 300 వరకు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఎఫెక్ట్​సనత్​నగర్​తో పాటు చుట్టుపక్కల ఏరియాలపైనా ఉండనున్నది. వాస్తవానికి గాలివాటాన్ని బట్టి గాలి నాణ్యత పెరగడం, తగ్గడం ఉంటుంది. ఒకచోట నమోదయ్యే వాల్యూస్​ఆ ప్రాంత చుట్టుపక్కల నాణ్యతను కూడా సూచిస్తాయి. ఈ లెక్కన నగరంలో ఈ చలికాలం గాలి నాణ్యత సరిగ్గా లేదనే చెప్పవచ్చు. 

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. 

ఢిల్లీలో పొల్యూషన్​గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ చలికాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. మన హైదరాబాద్​లో ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా.. మన చేతులారా మనమే ఆ పరిస్థితిలోకి నెట్టివేసుకుంటున్నాం. గాలి, నేల, నీరు పొల్యూట్​కాకుండా తీసుకోవాల్సిన చర్యల విషయంలో వెనకబడే ఉన్నాం. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించేలా చేసి కాలుష్యాన్ని నివారింపజేయాల్సిన వివిధ ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు ఢిల్లీ లాంటి పరిస్థితి రాక తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Also Read :- ప్రపంచ పాల ఉత్పత్తిలో మనమే టాప్

కారణాలు అనేకం.. 

సిటీలో కాలం చెల్లిన వాహనాలు, వాహనాల సంఖ్య పెరిగిపోవడం, చెట్ల నరికివేత, చెత్త కాల్చివేత, బిల్డింగులు నిర్మించేప్పుడు రూల్స్​పాటించకపోవడం, నిర్మాణాల టైమ్ లో బ్లాస్టింగులు చేయడం వంటి కారణాల వల్ల కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. సిటీలో చాలా చోట్ల ఇష్టానుసారంగా చెట్లను నరికివేస్తున్నారు. ప్రైవేట్​వ్యక్తులు, సంస్థలు, ఆఖరికి ప్రభుత్వ శాఖలు కూడా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. సనత్​నగర్ దగ్గరలో ఉండే మూసాపేట్ లోని ఐడీఎస్​లేక్ పక్కన ఉన్న గల్ఫ్​ఆయిల్​సంస్థకు చెందిన భూముల్లో డెవలప్​మెంట్ కోసం వందల చెట్లను నరికేశారు. గత నెలలో హైటెక్​సిటీలో రైల్వే లైన్​కోసం ఓ సంస్థ ఇలానే చెట్లను నరికివేసింది. మరోవైపు సిటీలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. కాలం చెల్లిన వాహనాలు కూడా రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో వాటి నుంచి విడుదలయ్యే పొగ ఎక్కువ స్థాయిలో పొల్యూషన్​ను క్రియేట్ చేస్తోంది. అలాగే సిటీలో చాలా ప్రాంతాల్లో రూల్స్​కు విరుద్ధంగా బిల్డింగులను నిర్మిస్తున్నారు. బ్లాస్టింగులు జరపడం వల్ల కిలోమీటర్ల మేర దుమ్ము, ధూళి కమ్ముకుంటోంది. 

కంప్లైంట్​చేసినా.. నో రెస్పాన్స్​

పర్యావరణ ఉల్లంఘనలపై జీహెచ్ఎంసీ, పీసీబీ, ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా స్పందించడం లేదు. కాలుష్య నియంత్రణలో జీహెచ్ఎంసీ, పీసీబీ, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పూర్తిగా విఫలమయ్యాయి. ఇకనైనా మేలుకోకపోతే ఢిల్లీ లాంటి పరిస్థితులు హైదరాబాద్ లోనూ ఏర్పడతాయి.  
- వినయ్ వంగల,  సోషల్ యాక్టివిస్ట్, హైదరాబాద్  

చలికాలంలో కాలుష్యంలో మార్పు  

చలి కాలంలో గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. బరువైన పొగ ఎక్కువ దూరం వెళ్లదు. అందుకే ఎయిర్​ క్వాలిటీ పడిపోతుంది. ఎల్బీనగర్ ​నుంచి మియాపూర్, ఉప్పల్​ నుంచి హైటెక్​ సిటీ వైపు ఎక్కువగా వెహికల్స్ వెళ్తుంటాయి. రెండు వైపుల నుంచి వచ్చే వెహికల్స్​పంజాగుట్ట వద్ద కలుస్తాయి. దీంతో అక్కడ ఎక్కువ పొల్యూషన్​ నమోదు కావాలి. కానీ గాలి సనత్ నగర్ వైపు వీయడం వల్ల అక్కడ ఎయిర్ ​క్వాలిటీ పడిపోతున్నది.  
- ప్రసన్న కుమార్, సీనియర్​ సోషల్ సైంటిస్ట్, పీసీబీ 

జాగ్రత్తలు తీసుకోవాలి: పీసీబీ  

గ్రేటర్ లో గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పీసీబీ అధికారులు సూచించారు. వాహనాల రద్దీ, ఇండస్ట్రీల కారణంగా సనత్​నగర్​లో గాలి నాణ్యత పడిపోతున్నదని చెప్పారు. దీని కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు, చర్మంపై, కండ్లల్లో మంటలు వంటి సమస్యలు ఏర్పడతాయన్నారు. బయటకి వెళ్లాల్సి వస్తే ముఖానికి మాస్క్, కళ్లకి అద్దాలు, తలకి హెల్మెట్ లేదా స్కార్ఫ్ తప్పనిసరిగా కట్టుకుని వెళ్లాలన్నారు. ఊపిరితిత్తుల​వ్యాధులు ఉన్నవారు, చిన్న పిల్లలు, గర్భిణులు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు. సనత్​నగర్​లాంటి ప్రాంతాల్లో ఉత్పత్తిని తగ్గించుకోవాలని, పొల్యూషన్ ను తగ్గించే ఎక్విప్​మెంట్​వాడాలని పరిశ్రమలకు నోటీసులు ఇస్తున్నామన్నారు.