మొత్తం మారిపోయారు.. ప్రైవేట్ బడుల్లో తెలుగు లేనట్టే.. మాతృభాషకు డేంజర్ బెల్స్

దేశ భాషలందు తెలుగు లెస్స.. అనే మాటలు ఇక పుస్తకాలకే పరిమితం కానున్నాయి. పదేళ్ల కింద వరకు తెలుగు మీడియం విద్యార్థులతో కళకళలాడిన బడులన్నీ.. ప్రస్తుతం ఆ మీడియంలో అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్.. ఇట్ల స్కూలు ఏదైనా చదివేది ఇంగ్లీష్  మీడియమే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. తెలుగు మీడియంలో చేరే పిల్లల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టాల్సిన దుస్థితి.

విద్యాహక్కు చట్టంతో పాటు నూతన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) సైతం విద్యలో మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నది.    ప్రైమరీ వరకూ మాతృభాషలోనే చదువులు కొనసాగించాలని న్యూ ఎన్​ఈపీ  సూచించింది. కానీ, ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ పాలసీని అధికారికంగా అమలుచేయడంలేదు. దీంతో మాతృభాష  నిబంధనను పక్కనపెట్టారు. మరోపక్క 2010 నాటికే చదువంటే ఇంగ్లీష్​లో చదవడం, రాయడం, మాట్లాడడం అనే స్థాయికి పరిస్థితులు మారాయి. ఇంగ్లీష్​లో పట్టు ఉన్న వాళ్లకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలుపెరగడంతో దిగువ మధ్యతరగతి, పేద తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్​ మీడియం వైపు తమ పిల్లలను పంపుతున్నారు. 

ALSO READ | Good Health : పిల్లల్లో రోజురోజుకు తగ్గుతున్న ప్రొటీన్లు.. ఇవి తింటే బలంగా తయారవుతారు..!

ఇట్ల అర్బన్​ మొదలుకొని రూరల్​ వరకు పేరెంట్స్ తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తూ ఉండడంతో  మాతృభాషలో అడ్మిషన్లు పడిపోతున్నాయి.  కాగా, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై పేరెంట్స్ మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్​సీఈఆర్టీ డైరెక్టర్ డీపీ సక్లానీ ఇటీవల పేర్కొన్నారు. మాతృభాషలో చదవడం వల్ల సగటు విద్యార్థులు కూడా ఆయా సబ్జెక్టులపై ఎంతోకొంత పట్టుసాధిస్తారని, ఇంగ్లీష్​ మీడియం కారణంగా భాష అర్థం కాక, అబో యావరేజ్​ స్టూడెంట్లు కూడా బిలో యావరేజ్​గా మారిపోతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి స్టూడెంట్లకు అటు తెలుగు, ఇటు ఇంగ్లీష్​ రాక, సబ్జెక్టులపై పట్టు సాధించలేక ఎందుకూ పనికిరాకుండా పోతున్నారని హెచ్చరిస్తున్నారు.

ప్రైవేటు బడుల్లో తెలుగు లేనట్టే!

సర్కారు బడుల్లో కొద్దొగొప్పో తెలుగు మీడియం పిల్లలుండగా.. ప్రైవేటు బడుల్లో  దాదాపు ఇంగ్లీష్​ మీడియంలోనే చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో మొత్తం 4.40 లక్షల మంది చేరితే దాంట్లో కేవలం 1,460(0.33%) మంది తెలుగు మీడియంను ఎంచుకున్నారు. ఇంగ్లీష్ మీడియంలో  రెండో తరగతిలో 93.19%, మూడో తరగతిలో 93%, నాలుగో తరగతిలో 92.89% , ఐదో తరగతిలో 93.14 శాతం, ఆరులో 93%, ఏడులో 94%, 8వ తరగతిలో 94.05 శాతం, నైన్త్ క్లాసులో 94.71%, టెన్త్ క్లాసులో 95.71 శాతం మంది చదువుతున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి.  అన్ని క్లాసుల్లోనూ 15శాతం వరకూ తెలుగుమీడియంలో చదువుతుం డగా.. ఇంగ్లీష్ మీడియంలో  70 శాతం నుంచి 75 శాతం వరకూ చదువుతున్నారు.