ఆందోల్ ప్రాంతంలో రూ.60 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్: మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి జిల్లా: ఆందోల్ ప్రాంతంలో రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.60 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించబోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆనాడు రూ.110 కోట్లతో రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో సింగూరు కాల్వ పనులు చేపట్టామని, ఇప్పుడు సింగూరు కాలువకు రూ.168 కోట్లతో సిమెంట్ కాంక్రీట్ పనులు చేపట్టనున్నామని ఆయన చెప్పారు. 

జోగిపేటలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ వ్యాఖ్యలు చేశారు. అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ కల సాకారమైందని, కానీ.. కేసీఆర్ సీఎంగా తొమ్మిది సంవత్సరాల్లో నిరంకుశ పాలన సాగిందని విమర్శించారు. ప్రశ్నిస్తే పోలీస్ జులుంతో అణచివేతలు తప్ప ప్రజా పాలన అందలేదని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ప్రజా పద్ధతిలో మార్పును ప్రజలు తీసుకువచ్చారని, ఆరు గ్యారెంటీలు.. మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సులు, ఆరోగ్య శ్రీ, ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని మంత్రి గుర్తుచేశారు. ఖచ్చితంగా రైతు ఋణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. కాళేశ్వరం అని చెప్పి లక్షల కోట్లు కొల్లగొట్టారని బీఆర్ఎస్ పాలనపై మంత్రి విమర్శలు గుప్పించారు. పోరాటం చేసి హక్కులు సాధించుకున్న ఘనత మల్లన్న సాగర్, కొండ పోచమ్మ రైతులదని ఆయన కొనియాడారు.

ప్రజాపాలన ఏర్పడి పదకొండు మాసాలు పూర్తి కాకుండానే బీఆర్ఎస్ నేతలు హింసకు పాల్పడుతున్నారని, కలెక్టర్పై దాడులు చేయిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రాజకీయంలో గూండాయిజం, రౌడీయిజం నడవదని తెలిసి ఢిల్లీ వెళ్లి రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ ఢిల్లీ టూర్ను ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లాకు మూడు కోట్ల రూపాయలు.. పావలా వడ్డీకి రుణాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.