తండ్రీకొడుకుల చేత మూత్రం తాగించిన దుండగులు

తండ్రీకొడుకుల చేత మూత్రం తాగించిన దుండగులు

రాజస్థాన్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత వర్గానికి చెందిన తండ్రీకొడుకుల చేత కొంతమంది దుండగులు బలవంతంగా మూత్రం తాగించారు. ఈ దారుణం బార్మెర్‌‌లోని బిజ్రాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోహద్ కా తాలా గ్రామంలో జరిగింది. స్థానికంగా నివసించే రాయ్‌చంద్ మేఘవాల్ తన కుమారుడు రమేష్‌తో కలిసి కిరాణా దుకాణంలో సామాన్లు కొంటుండగా.. దాదాపు 15 మంది దుండగులు దాడి చేశారు. తండ్రీకొడుకులిద్దరినీ విపరీతంగా కొట్టారు. దాడిలో రాయ్‌చంద్ పన్ను ఊడిపోగా.. రమేష్ కాలు విరిగింది. అనంతరం కులం పేరుతో దూషిస్తూ.. రాయ్‌చంద్‌తో మూత్రం తాగించారు. స్థానికులు స్పందించి.. బాధితులను ప్రథమ చికిత్స కోసం చౌహతాన్‌‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆ తర్వాత బార్మెర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.

తండ్రీకొడుకుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఖేత్ సింగ్ సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇది పాత శత్రుత్వానికి సంబంధించిన కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకోవడానికి గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.