ఔరంగాబాద్: పైసల్ తీస్కొని కూడా తనకు ఓటెయ్యలేదని పంచాయతీ ఎన్నికల్లో ఓడిన ఓ కేండిడేట్ ఇద్దరు దళితులపై దాడి చేసిండు. వీధిలో నిలబెట్టి తిడుతూ, వారితో గుంజీలు తీయించిండు. రోడ్డుపై ఉమ్మేసి వారితో బలవంతంగా నాకించిండు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఔరంగాబాద్ జిల్లాలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ హెడ్‌గా పోటీచేసిన బల్వంత్ సింగ్ ఓడిపోయిండు. తన ఓటమికి కారణం దళితులు ఓటేయకపోవడమేనని భావించి ఆవేశంతో రగిలిపోయిండు. ఇద్దరు దళితులను వెతికిపట్టుకుని వారిపై తిట్లదండకం చదివిండు. అంతటితో ఆగక వారితో రోడ్డుపై గుంజీలు తీయిస్తూ దాడి చేసిండు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి నెట్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. అయితే, ఆ ఇద్దరు యువకులు మందు తాగి రోడ్డుపై న్యూసెన్స్ చేస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకే గుంజీలు తీయించానని బల్వంత్ సింగ్ వివరణ ఇచ్చాడు. వీడియోలో మాత్రం ఎన్నికల్లో తనకు ఓటేయడానికి వారికి డబ్బిచ్చినట్లు బల్వంత్ చెప్తున్నట్లు ఉంది.
