లక్నో: ఓ దుకాణంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా.. టపాసుల్లా పెద్ద శబ్దం చేస్తూ 18 సిలిండర్లు పేలిపోయాయి. పేలుడు శబ్దాల ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కంపించాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్రి బేగంగంజ్ పరిధిలో జరిగిందీ ప్రమాదం. సిలిండర్ల పేలుడు ధాటికి దుకాణం పైకప్పు ఎగిరిపడింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఫైరింజన్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నా మంటలు పూర్తిగా ఆర్పడానికి 3 గంటలుపైనే పట్టింది. గ్యాస్ సిలిండర్లు అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న దుకాణం పక్కనే ఉన్న మరో మూడు దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. షాపుల్లోని వస్తువులన్నీ మంటల్లో కాలిపోయాయి. పేలుడు శబ్దం విన్నవెంటనే దుకాణాల్లోని వారు భయంతో బయటకు పరిగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు జరిగిన దుకాణంలో నిర్వాహకుడు 40 సిలిండర్లు పెట్టుకుని రీఫిల్లింగ్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే షాపుల్లోని వారు బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
