గత కొద్ది రోజులుగా చెన్నైని వణికిస్తున్న వాయుగుండం తీరాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, తమిళనాడు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షం, ఈదురు గాలులు కారణంగా విమానాలను రద్దు చేశారు అధికారులు. హైదరాబాద్, ముంబై, కోల్‌కతాకు విమానాలను మళ్లించారు. తమిళనాడులో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నవర్షాల ధాటికి 14 మంది మృతి చెందారు.
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తిరుపతి పట్టణం జలమయం అయింది. తిరుమల కొండపైనా ఈ మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులను అలర్ట్ చేసింది ఏపీ ప్రభుత్వం.
