ఈ తుఫాన్ ఏదో తేడాగా ఉందే.. 6 గంటల్లో 2 కిలోమీటర్లు మాత్రమే కదిలింది.. తీరం దాటేది ఎప్పుడంటే..!

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కదిలిక చాలా చాలా నెమ్మదిగా ఉంది. అంచనాలకు అందకుండా దాని గమనం.. వేగం ఉండటం విశేషం. తీవ్రవాయుగుండం మారిన తర్వాత.. వేగం ఊహించని విధంగా తగ్గిపోయింది. ఆరు గంటల్లో కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే కదిలింది. వాస్తవంగా 29వ తేదీనే తీరం దాటుతుందని అంచనా వేశారు అధికారులు. ఎందుకంటే.. అప్పుడు దాని వేగం గంటకు 12 కిలోమీటర్లుగా ఉంది.. ఇప్పుడు తుఫాన్ కన్ను కదలిక అత్యంత తక్కువకు పడిపోయింది. 6 గంటల్లో కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే కదులుతుంది.. అంటే గంటకు అర కిలోమీటరు కూడా కాదు.. 

2024, నవంబర్ 28వ తేదీ ఉదయానికి ఫెంగల్ తుఫాన్.. ట్రింకోమలీకి 110 కిలోమీటర్లు. నాగపట్నానానికి 310 కిలోమీటర్లు.. పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు.. చెన్నై సిటీకి 480 కిలోమీటర్ల  దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

అత్యంత తీవ్ర వాయుగుండంగా ఉన్న ఫెంగల్.. 29వ తేదీ ఉదయానికి తుఫాన్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయానికి.. తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.దీని ప్రభావంతో మూడు రోజులు (నవంబర్ 28 నుండి 30 వరకు) దక్షిణకోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు,రాయలసీమలో శుక్ర, శనివారాల్లో ( నవంబర్ 29, 30 ) అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

గురువారం ( నవంబర్ 28, 2024 ) సాయంత్రం వరకు తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. శనివారం ( నవంబర్ 30, 2024 ) ఉదయం వరకు గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లోద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళద్దని సూచించింది వాతావరణ శాఖ. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ.