ఆరోగ్యమస్తు ! రోజూ అరగంట సైకిల్ తొక్కండి

ఆరోగ్యమస్తు ! రోజూ అరగంట సైకిల్ తొక్కండి

 ఇంటి నుంచి కాలు బయట పెడితే బైక్​ లేదంటే కారు. కొద్దిపాటి దూరమైనా వాహనాల వాడకం తప్పనిసరి అయ్యింది. దీంతో శరీరానికి ఎక్సర్​సైజ్ లేకుండా పోయింది. అయితే, ప్రతి రోజు వ్యాయామం చేయలేమనుకునే వాళ్లు కనీసం 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే చాలట. వాటి వల్ల కలిగే లాభాలు అలాం టివి మరి.. సైకిల్ తొక్కడం వల్ల శరీరం మొత్తం కదులుతుంది. దీంతో దాదాపు అన్ని భాగాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వాళ్లు సైక్లింగ్ చేస్తే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. నిత్యం 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే 60 శాతం వరకు మధుమేహం తగ్గే అవకాశాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే సైక్లింగ్ తో హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

సైకిల్ తొక్కుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోడం, వదలడం వేగంగా చేస్తారు. కాబట్టి శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి. కీళ్ల నొప్పులు ఉన్న వాళ్లు సైక్లింగ్ అలవాటు చేసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సైక్లింగ్ చేస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది. దీంతో డిప్రెషన్‌, ఒత్తిడి తగ్గుతాయని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. అలాగే మెదడు పనితీరు మెరుగుపడి.. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.