- ఆపై దుబాయ్‌కి తరలింపు..
- 21 మంది సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: కొల్లగొట్టిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్‌కి తరలిస్తున్న 21 మంది ముఠాను సైబర్‌సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్‌చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు, ఓల్డ్ సిటీకి చెందిన 8 మంది, క్యాష్ విత్ డ్రా చేసే 13 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 20 మొబైల్‌ఫోన్లు, 15 బ్యాంకు పాస్‌బుక్స్, డెబిట్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరి వివరాలను టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ సోమవారం వెల్లడించారు.
సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్న సొమ్మును గతంలో మ్యూల్ ఖాతాల(వేరొకరి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు)ల్లోకి మళ్లించేవారు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించడంతో రూటు మార్చారు. వారి ఖాతాల్లోకి వచ్చిన డబ్బును చెక్కులు ఉపయోగించి డ్రా చేస్తున్నారు. తర్వాత సైబర్ ఏజెంట్లకు అందిస్తున్నారు. 8 మంది ఏజెంట్లు క్యాష్‌ను క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్‌లోని కింగ్‌పిన్ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు.
తాజాగా పట్టుబడిన వారిలో ప్రైవేటు ఉద్యోగులు, సివిల్ కాంట్రాక్టర్, బ్యాంకు ఉద్యోగి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జిమ్ ట్రైనర్, టైలర్ తదితరులు ఉన్నారని శిఖాగోయల్ పేర్కొన్నారు. నిందితులకు రాష్ట్ర వ్యాప్తంగా 25, దేశవ్యాప్తంగా 73 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు తెలిపారు. నిందితులంతా సేవింగ్ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తున్నట్టు గుర్తించామన్నారు. అరెస్ట్ అయిన 13 మంది ఇప్పటి వరకు చెక్కుల ద్వారా మొత్తం రూ.8.2 కోట్లు విత్‌డ్రా చేసి ఏజెంట్లకు అందించినట్లు తెలిపారు. ఏజెంట్లు నగదును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్‌కు తరలించినట్టు గుర్తించామన్నారు.