మంచిర్యాల జిల్లాలో విపరీతంగా పెరిగిన సైబర్ ​నేరాలు.. సైబర్ మోసాలకు జీవితాలు బలి

  • రూ.2.71 కోట్లు దోపిడీ
  • ఆన్​లైన్​ట్రేడింగ్, లోన్​యాప్​ల వేధింపులకు 10 మందికి పైగా సూసైడ్
  • 412 యాక్సిడెంట్లలో 132 మంది మృతి, 434 మందికి గాయాలు 
  • పెరిగిన రేప్, కిడ్నాప్, చీటింగ్, రాబరీ, దోపిడీ కేసులు 
  • జిల్లాలో నిరుటి కన్నా తగ్గిన 660 కేసులు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో సైబర్ ​నేరాలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాదిలో 134 కేసులు నమోదయ్యాయి. సైబర్​ నేరగాళ్లు మాయచేసి రూ.2.71  కోట్లు దోచుకున్నారు. ఆన్​లైన్​ ట్రేడింగ్, బెట్టింగ్​ల మాయలో యువకులు కోట్లలో నష్టపోయారు. చేసిన అప్పులు తీర్చలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. లోన్ ​యాప్​ల వేధింపులకు మరికొందరు బలయ్యారు. 2024లో జిల్లాలో జరిగిన నేరాల వివరాలను రామగుండం పోలీస్​ కమిషనర్​ ఎం.శ్రీనివాస్​ శనివారం మీడియాకు రిలీజ్​ చేశారు. రానున్న రోజుల్లో సైబర్​ నేరాల సంఖ్య భారీగా పెరిగే చాన్స్​ఉందని, ప్రజలు అలర్ట్​గా ఉండాలని హెచ్చరించారు. 

  • మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక మహిళ నుంచి ఆన్​లైన్ పార్ట్ టైం జాబ్ పేరుతో రూ.31.60 లక్షలు దోచుకున్నారు. అక్టోబర్ 21న కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. సైబర్ నేరస్తులు హైదరాబాద్​లోని మలక్​పేటకు చెందిన మహమ్మద్ ఆవాద్(21), ఇలియాస్ అని గుర్తించారు. ఇలియాస్ ​సూచన మేరకు ఆవాద్.. ప్రజలకు కమీషన్ ఆశ చూపి దోపిడీకి పాల్పడ్డారు. ఆవాద్​ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. 
  • తాండూరు మండలం కాసిపేటకు చెందిన సముద్రాల మొండయ్య(58), భార్య శ్రీదేవి(53), కూతురు చైతన్య(30), కొడుకు శివప్రసాద్(26) ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. శివప్రసాద్ స్టాక్ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో చాలామంది దగ్గర అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చడానికి మరోచోట అప్పులు చేసుకుంటూ వెళ్లాడు. వీటికి వడ్డీలు పెరిగిపో యాయి. కిరాణా షాపు నడుపుతూ, పాల వ్యాపారం చేసే మొండయ్యకు.. కొడుకు చేసిన అప్పులు తీరని భారంగా మారాయి. ఆ కుటుంబంలో నలుగురిని బలిగొన్నాయి. 
  • మంచిర్యాల రెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్​సింగరేణి కార్మికుడు ఇప్ప కొమురయ్య కొడుకు వెంకటేశ్(40) హైదరాబాద్ ​జీడిమెట్లలోని గాజులరామారంలో ఉంటూ సాఫ్ట్​వేర్ ​జాబ్ ​చేస్తున్నాడు. ఆన్​లైన్​ ట్రేడింగ్, బెట్టింగ్​లో రూ.30 లక్షల వరకు నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో భార్య వర్షిణి(32), పిల్లలు రిషికాంత్(11), విహంత్(3)కు విషం ఇచ్చాడు. తర్వాత తాను ఉరేసుకున్నాడు. 

నెత్తురోడిన రోడ్లు

మంచిర్యాల జిల్లాలో మొత్తం 412 యాక్సిడెంట్లు జరిగాయి. 132 మరణించగా, 434 మందికి గాయాలయ్యాయి. స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్​ అండ్ ​డ్రైవ్​యాక్సిడెంట్లకు కారణాలు. హెల్మెట్ ధరించకపోవడం విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలో ఏడాది కాలంలో కిడ్నాప్​లు, రేప్​లు, చీటింగ్​ కేసులు పెరిగాయి. 2023లో కిడ్నాప్​కేసులు 45 నమోదు కాగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 55కు పెరిగింది. నిరుడు 27 రేప్​లు జరిగితే ఈ యేడు 41 రేప్​ కేసులు నమోదయ్యాయి. 

రాబరీ, థెఫ్ట్​ కేసుల గ్రాఫ్​పైకిపోగా.. మర్డర్, అటెంప్ట్​మర్డర్, మిస్సింగ్ ​కేసులు తగ్గాయి. 2023లో రాబరీ కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం ఏడు కేసులు వచ్చాయి. చోరీల సంఖ్య 161 నుంచి ఏకంగా 228కి పెరిగింది. మర్డర్లు 24 నుంచి 22కు, అటెంప్ట్​మర్డర్​ కేసులు 45 నుంచి 40కి, మిస్సింగ్​ కేసులు 318 నుంచి 273కు తగ్గాయి. మొత్తంగా గతేడాది కన్నా ఈ ఏడాది కేసుల సంఖ్య తగ్గింది. నిరుడు 5,115 కేసులు నమోదు కాగా, ఈసారి డిసెంబర్​20 వరకు 4,455 కేసులు రికార్డయ్యాయి. 2023తో పోల్చుకుంటే 660 కేసులు తగ్గాయి.