వాట్సాప్ ​డీపీని నగ్నంగా మార్చి బ్యాంక్ ​మేనేజర్​కు టోకరా

  • మెసేజ్​ లింక్ ​పంపించి ఫోన్​ హ్యాక్​ 
  • రూ.లక్షన్నర పంపిన బాధితుడు 
  • అయినా కాంటాక్ట్స్​లోని 300 మందికి న్యూడ్​ ఫొటోలు పంపిన క్రిమినల్స్​

నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ టౌన్, వెలుగు : ఓ బ్యాంకు మేనేజర్​ను టార్గెట్​ చేసిన సైబర్ ​క్రిమినల్స్​ అతడి వాట్సాప్​ డీపీని మార్ఫింగ్​ చేసి న్యూడ్​గా మార్చి  రూ.లక్షకు పైగా దండుకున్నారు. తెలివిగా మేనేజర్ ​ ఫోన్‌‌‌‌‌‌‌‌కు ఓ మేసేజ్​ను పంపిన సైబర్​ నేరగాళ్లు ఆ లింక్​పై క్లిక్​ చేయగా ఫోన్​ హ్యాక్​ చేశారు.  తర్వాత ఫోన్​ చేసి బ్లాక్​మెయిల్​ చేసి డబ్బులు వేయించుకున్నారు. బాధితుడి కథనం ప్రకారం..నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్ ఫోన్‌‌‌‌‌‌‌‌కి వారం క్రితం మెసేజ్ రూపంలో ఓ లింక్ వచ్చింది. 

ఆయన ఆ లింక్ ను క్లిక్​చేసి ఓపెన్ ​చేయగా ఫోన్​హ్యాక్​అయ్యింది. సైబర్ నేరగాళ్లు మేనేజర్​వాట్సాప్ డీపీలో ఫొటోను మార్ఫింగ్​ చేసి న్యూడ్ గా మార్చారు. దాన్ని ఇంటర్​నెట్​లో సర్క్యులేట్​చేసి పరువు తీస్తామని బ్లాక్ మెయిల్ చేయడంతో అడిగినంత డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్లాడు. ఇలా దఫదఫాలుగా రూ.లక్షా 56 వేల వరకు చెల్లించుకున్నాడు. ఇంకా డబ్బులు కావాలని అడగడంతో ఇవ్వలేదు. దీంతో బ్యాంకు మేనేజర్ కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌లోని 300 మందికి ఆయన న్యూడ్ ఫొటోలు పంపించారు. దీంతో ఎలాగూ పరువు పోయిందని సదరు మేనేజర్ ​నాగర్ కర్నూల్ సైబర్ క్రైమ్ పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

భద్రాచలంలో డాక్టర్​ను ముప్పుతిప్పలు పెట్టి..

భద్రాచలం :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ఆర్థోపెడిక్ ​డాక్టర్​ను సైబర్ క్రిమినల్స్​వాట్సాప్​ కాల్​చేసి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముప్పు తిప్పలు పెట్టారు. ఆయన బ్యాంకు అకౌంట్లలోని నగదు కాజేసేందుకు నానా ప్రయత్నాలు చేశారు. గ్రేటర్​ముంబై పోలీస్ ​ అంటూ వాట్సాప్ ​ద్వారా సోమవారం డా.సుదర్శన్​కు కాల్ వచ్చింది. ఆయన ఉన్న చోటు నుంచి వెంటనే మరో గదిలోకి వెళ్లాలంటూ హెచ్చరించారు. దీంతో డాక్టర్​ వారు చెప్పినట్టే  చేశాడు . ‘మీరు మనీ ల్యాండరింగ్​ కేసులో ఇరుక్కున్నారు’ అంటూ బెదిరించాడు. 

తనకు ముంబైతో సంబంధం లేదని చెప్పినా వినలేదు. ఆయన ఫోన్​ను అంతకుముందే హ్యాక్​చేసి డాక్టర్​ అకౌంట్లలో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకున్నారు.  ‘ నీ బ్యాంకు అకౌంట్లలో అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. ఆ మొత్తమంతా ఆర్​బీఐ అకౌంట్​కు వెంటనే ట్రాన్స్​ఫర్​ చెయ్​’ అంటూ ఓ బ్యాంకు అకౌంట్ ​నెంబర్ ​చెప్పారు. అక్కడే డాక్టర్​కు అనుమానం రావడంతో మాట్లాడుతూనే వెళ్లి ఏఎస్పీ పంకజ్​ పరితోష్​కు సమాచారమిచ్చాడు. ఆయన చెక్​ చేసి అది ఫేక్​ కాల్​ అని, వెంటనే కట్​ చేయాలని సూచించారు. పోలీసులు ధైర్యం చెప్పడంతో డాక్టర్​కాల్​ కట్ ​చేసి గండం నుంచి బయటపడ్డారు.