ప్రాబ్లమ్ ఉందని ఫిర్యాదు చేస్తే ఖాతా ఖాళీ.. రూ.1.60 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

బషీర్ బాగ్, వెలుగు: బ్యాంక్ యాప్‎లో ప్రాబ్లమ్ ఉందని ఆన్​లైన్‎లో ఫిర్యాదు చేసిన  వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.67 లక్షలు కొట్టేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపిన  ప్రకారం..  హైదరాబాద్ సిటీకి చెందిన 82 ఏండ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పంజాబ్​ నేషనల్ బ్యాంక్ వన్ యాప్ వాడుతున్నాడు. అందులో ప్రాబ్లమ్  తలెత్తడంతో ఆన్​లైన్ ద్వారా న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్​కు ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధిత వృద్ధుడికి బ్యాంక్ నుంచి అంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. వాట్సాప్‎కు ఒక ఫైల్​పంపించామని, దాన్ని ఇన్​స్టాల్ చేసుకుంటే 24 గంటల్లో  సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. 

 మరుసటి రోజు సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితుడికి వాట్సాప్​లో వీడియో కాల్ చేసిన చీటర్స్..  మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుడు తన అకౌంట్ నుంచి నగదు బదిలీ చేయడానికి ప్రయత్నించగా, సాధ్యం కాలేదు. దీంతో అకౌంట్‎లో బ్యాలెన్స్ చెక్ చేసుకోగా, రూ 1.67 లక్షలు బదిలీ అయినట్లు చూసి ఖంగుతిన్నాడు. మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.