సెంట్రల్​ గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి రూ.24.50 లక్షలు కాజేశారు..!

బషీర్ బాగ్, వెలుగు: సెంట్రల్​ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి,  ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.24.50 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 22 ఏండ్ల ప్రైవేటు ఉద్యోగి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుండగా , అతనికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పేరిట ప్రకటన కనిపించింది. దానికి ఆకర్షితుడైన బాధితుడు ఆ ప్రకటనలో ఇచ్చిన సైబర్ నేరగాళ్ల నంబర్లకు డయల్ చేశాడు. స్కామర్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి, ప్రాసెస్ చేయడానికి రిజిస్ట్రేషన్ చార్జీల పేరిట కొంత డబ్బును కోరారు.

అనంతరం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చాలా డిమాండ్ ఉందని , మరింత డబ్బు చెల్లిస్తే తనకే ఉద్యోగం వస్తుందని నమ్మబలికారు. అనుమానం రాకుండా ఉండేందుకు జాబ్ కు సంబందించిన ఫేక్ ఐడీ కార్డును పంపించారు. దీంతో నమ్మకం కలిగిన బాధిత ఉద్యోగి మొత్తం రూ.24.50 లక్షలను బదిలీ చేశాడు. మరింత డబ్బు కోసం ఫేక్ ఆఫర్ లెటర్ ను పంపించారు. అనుమానం వచ్చిన బాధిత ఉద్యోగి, దానిని వేరిఫై చేయగా ఫేక్ అని తేలింది. దీంతో చీటర్స్ తో కాంటాక్ట్​లో ఉంటూనే , తనకు జరిగిన మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.