- పోయినేడాదితో పోలిస్తే
- 11,914 కేసుల్లో రూ.793 కోట్లు లూటీ
- ఇందులో వెయ్యి డిజిటల్ అరెస్టు మోసాలు
- కమిషనరేట్ పరిధిలో 64% పెరిగిన ఓవరాల్ క్రైమ్ రేటు
- 2024 వార్షిక నివేదిక విడుదల చేసిన సీపీ అవినాశ్ మహంతి
హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక కేసులు ఇక్కడే నమోదయ్యాయి. పోయినేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసులు డబుల్ అయ్యాయి. పోయినేడు 5,361 కేసులు నమోదు కాగా, ఈసారి 11,914 కేసులు (122% అధికం) నమోదయ్యాయి. ఈ కేసుల్లో రూ.793.18 కోట్లను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. ఇక సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్టు ఘటనలు కూడా పెరిగిపోయాయి. ఈ ఏడాది 1,002 డిజిటల్ అరెస్టు కేసులు నమోదు కాగా, వాటిల్లో రూ.80.57 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.
మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో 2024 వార్షిక నివేదికను సీపీ అవినాశ్ మహంతి విడుదల చేశారు. సైబర్ నేరాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని ఆయన తెలిపారు. రూ.1.5 లక్షలు దాటిన సైబర్ నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నామని, ఇందులో భాగంగానే పోయినేడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ కేసులు 122 శాతం అధికంగా నమోదయ్యాయని చెప్పారు. మొత్తం 11,914 కేసులు నమోదు చేయగా.. ఇందులో గోల్డెన్ హవర్స్‌లో రూ.71.28 కోట్లు సీజ్ చేసి, రూ.70.46 కోట్లు బాధితులకు రీఫండ్ చేశామని వివరించారు.
ఇక ఈసారి డిజిటల్ అరెస్టు నేరాలు కూడా పెరిగాయని వెల్లడించారు. ‘‘పోయినేడాది 102 కేసులు నమోదు కాగా, ఈసారి 1,002 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు రూ.80.57 కోట్లు కోల్పోయారు. మేం రూ.11.02 కోట్లను సీజ్ చేసి, అందులో రూ.5.70 కోట్లను బాధితులకు రీఫండ్ చేశాం” అని తెలిపారు. ఈ కేసుల్లో ఐటీ, ప్రైవేట్ ఎంప్లాయ్స్ ఎక్కువ మంది బాధితులు ఉంటున్నారని చెప్పారు. డిజిటల్ అరెస్టు మోసాలపై వాళ్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఆర్థిక నేరాల్లో 203 మంది అరెస్టు..
కమిషనరేట్ పరిధిలో ఓవరాల్ క్రైమ్ రేట్ పోయినేడాదితో పోలిస్తే 64% పెరిగిందని సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. పోయినేడాది మొత్తం 22,859 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 37,689 కేసులు నమోదయ్యాయని చెప్పారు. సైబర్ క్రైమ్స్ తో పాటు ఆర్థిక నేరాలపైనా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ‘‘ఐటీ కారిడార్, ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములను ఆక్రమించుకునేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక నేరాల నియంత్రణకు కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటు చేశాం.
ఈ వింగ్ ద్వారా ఇప్పటికే 94 కేసులు నమోదు చేసి, 203 మందిని అరెస్ట్ చేశాం. రూ.30.77 కోట్లు ఫ్రీజ్ చేశాం. రూ.5.29 కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేశాం. నకిలీ డాక్యుమెంట్లతో దాదాపు రూ.1,200 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినోళ్లపై కేసులు నమోదు చేశాం. వీటితో పాటు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, ప్రీ లాంచింగ్, బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్, డబుల్ గోల్డ్ స్కీమ్, గోల్డ్ చిట్స్, దీపావళి గోల్డ్ స్కీమ్స్ పేరుతో జరిగిన రూ.360 కోట్ల మోసాలకు సంబంధించి కేసులు నమోదు చేశాం” అని వెల్లడించారు.
ఇకపై లోకల్ స్టేషన్లలో సైబర్ ఫిర్యాదులు..
రూ.1.5 లక్షలకు పైగా జరిగే సైబర్ నేరాలకు సంబంధించి ఇకపై స్థానిక పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు స్వీకరిస్తామని సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. ఇది జనవరి 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. సైబర్ క్రైమ్స్, ఆర్థిక నేరాల నియంత్రణకు సరికొత్త స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) రూపొందించనున్నట్టు చెప్పారు. ‘‘జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. కొకైన్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించాం.
నార్సింగి పీఎస్‌లో జానీ మాస్టర్, రాజ్‌తరుణ్‌పై నమోదైన కేసుల్లో త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు చేస్తాం” అని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో కన్విక్షన్ రేట్ 47.62 శాతం ఉన్నదని.. ఈ ఏడాది 18 మందికి కోర్టులు జైవిత ఖైదు విధించాయని చెప్పారు. మరో 143 కేసుల్లో దోషులకు 5 ఏండ్ల నుంచి 20 ఏండ్ల వరకు జైలు శిక్షలు పడ్డాయన్నారు. కేంద్రం కొత్తగా తెచ్చిన బీఎన్ఎస్ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తున్నామని, వాటి కింద జులై నుంచి 14,250 కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
ఈ ఏడాది నమోదైన కొన్ని కేసులు వివరాలివీ..
నేరాలు 2023 2024
సైబర్ క్రైమ్ 5,361 11,914
ప్రాపర్టీ అఫెన్సెస్ 2,904 4,681
ఆర్థిక నేరాలు 1,551 2,140
సాధారణ దాడులు 1,396 1,963
రోడ్డు ప్రమాదాలు 2,224 3,024
ట్రెస్‌పాస్ 1,034 1,429
వరకట్న వేధింపులు 1,030 1,343