బషీర్ బాగ్, వెలుగు : మ్యాట్రిమోనీలో ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ ఫేక్ విమెన్ ప్రొఫైల్‌తో చీట్ చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం... 35 ఏళ్ల ఓ ప్రైవేట్ ఉద్యోగి పెండ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ లో రిజిస్టర్ చేసుకున్నాడు. అతనికి ఓ ప్రొఫైల్ నచ్చడంతో వివరాలను అడిగాడు. సైబర్ చీటర్స్ క్రియేట్ చేసిన ప్రొఫైల్ గా అతను తెలుసుకోలేకపోయాడు. వైజాగ్ కు చెందిన మహిళగా పరిచయం చేసుకుని , తాను మలేషియాలో ఉంటున్నట్లు తెలిపారు. కొన్ని రోజులు చాటింగ్ చేశాక బాధితుడు నమ్మాడు.
అనంతరం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టాలని... అందులో అధిక లాభాలు వస్తాయని , పెళ్లి తర్వాత స్థిరపడవచ్చునని తెలిపారు. ఇదంతా నిజమని నమ్మిన బాధితుడు రూ. 2.05 లక్షలు ట్రేడింగ్ చేశాడు. పెద్ద మొత్తంలో చేయాలని కోరడంతో , బాధితుడు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి లోన్ కోసం అప్లై చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.