- రోడ్డు ప్రమాదాల్లో 131 మంది మృతి, 366 మందికి గాయాలు
- పెరిగిన రేప్, చీటింగ్, చోరీల కేసులు
- ఓవరాల్ కేసుల నమోదులో గతేడాది కన్నా తగ్గుదల
- వార్షిక క్రైమ్ వివరాలను వెల్లడించిన సీపీ శ్రీనివాస్
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. మొత్తం 148 కేసులు నమోదు కాగా, సైబర్ నేరగాళ్లు మాయచేసి రూ.3.67 కోట్లు దోచుకున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్, బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్స్, తదితరాల్లో పెద్దమొత్తంలో జిల్లావాసులు డబ్బులు పోగొట్టుకున్నారు. 2024లో జిల్లాలో జరిగిన నేరాల వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆదివారం మీడియాకు రిలీజ్ చేశారు.
రోడ్డు ప్రమాదాలు పెరిగినయ్..
పెద్దపల్లి జిల్లాలో 2024లో మొత్తం 343 యాక్సిడెంట్లు జరిగాయి. ఇందులో 115 ఫ్యాటల్ కేసులు కాగా, 228 నాన్ ఫ్యాటల్ కేసులు ఉన్నాయి. ప్రమాదాల్లో 131 మంది మరణించగా.. 366 మందికి గాయాలయ్యాయి. రాజీవ్ రహదారిపై స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు కారణాలు. దీంతోపాటు చాలామంది హెల్మెట్ ధరించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.
.
పెరిగిన రేప్, చీటింగ్ కేసులు
పెద్దపల్లి జిల్లాలో రేప్, చీటింగ్‌కేసులు పెరిగాయి. 2023లో రేప్ కేసులు 19 నమోదు కాగా, ఈఏడాది ఆ సంఖ్య 35కు చేరింది. చీటింగ్‌కేసులు గతేడాది 272 నమోదు కాగా, ఈసారి వాటి సంఖ్య 322కి చేరాయి. మర్డర్లు నిరుడు 16 కేసులు నమోదైతే ఈసారి 17 జరిగాయి. అలాగే అటెంప్ట్ మర్డర్ కేసులు గతేడాది 46 నమోదైతే ఈ యేడు 51 నమోదయ్యాయి. దొంగతనాలు 273 నుంచి 324కి పెరిగాయి. రాబరీ కేసులు గతేడాది ఒకటి నమోదుకాగా ఈ సారి ఆ సంఖ్య ఐదుకు చేరుకున్నాయి. మిస్సింగ్ కేసుల విషయంలో కొంత తగ్గింది. 2023లో 303 మంది మిస్సింగ్ కాగా, ఈ యేడు 251 మంది మిస్ అయ్యారు. కిడ్నాప్‌లు గతేడాది 26 కేసులు నమోదుకాగా 21కి తగ్గాయి.
ఓవరాల్ కేసులు 600 తక్కువ నమోదు
రామగుండం కమిషనరేట్పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో అన్ని రకాల కేసులు గతేడాది కన్నా 600 తగ్గినట్లు సీపీ ప్రకటించారు. 2023లో 4,309 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్ 20వరకు 3,709 కేసులు ఫైల్ అయ్యాయి.
ALSO READ : జనవరి 1 నుంచి భిక్షాటన బంద్ .. నియంత్రణకు పోలీసులతో ప్రత్యేక టీమ్ లు
ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్తగా ఉండాలి
ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కొత్త కొత్త రూపాల్లో సైబర్ నేరగాళ్లు వస్తున్నారు. ఏమాత్రం అలసత్వంగా ఉన్నా అకౌంట్లలో ఉన్న డబ్బు కొట్టేస్తరు. బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. మద్యం తాగి వాహనాలు నడపకూడదు. బైక్‌లు నడిపేటప్పుడు హెల్మెట్, కారులో సీట్ బెల్ట్ తప్పక ఉపయోగించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలి. కొత్త ఏడాది తమ జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేలా ప్రతిఒక్కరూ వ్యవహరించాలి. - ఎం.శ్రీనివాస్, సీపీ, రామగుండం